హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల పాలిటశాపంగా మారిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టాన్ని రదు ్దచేయాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ వ్యవస్థ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ను అమలు చేయాలని కోరారు. పీఎఫ్ఆర్డీఏ ద్వా రా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని మండిపడ్డారు. పీఎఫ్ఆర్డీఏ, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లో కాన్స్టిట్యూషనల్ మార్చ్ నిర్వహించారు. ఎల్బీస్టేడియం నుంచి లోయర్‌ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, పీఎఫ్ఆర్డీఏ చట్టం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సొమ్ములను స్టాక్ మారెట్, కార్పొరేట్ కంపెనీలలో పెట్టుబడి పెట్టి.. దానిపై వచ్చే లాభనష్టాలను ఉద్యోగులకు అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. దీనిద్వారా రాష్ట్రంలోని 1.72 లక్షల ఉద్యోగులకు చెందిన రూ. 20వేల కోట్లు షేర్ మారెట్లో చలామణి అవుతున్నాయని, ఈ సొమ్ములను తిరిగి వారికే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మార్చ్‌లో తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోటకొండ పవన్ పాల్గొన్నారు.