మెట్పల్లి, జనవరి 9: పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలడంతో బోల్తాపడి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపేట శివారులో 63 జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ నుంచి 18 వేల లీటర్ల డీజిల్, 4 వేల లీటర్ల పెట్రోల్ లోడ్‌తో మల్లాపూర్ మండలం రాఘవపేటలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు ఈ ట్యాంకర్ బయలుదేరింది. మార్గమధ్యంలో వెంకట్రావుపేట శివారుకు రాగానే టైర్ పేలడంతో అదుపుతప్పి పక్కనున్న విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టి బోల్తాపడింది.
ఆ వెంటనే ట్యాంకర్‌కు పెద్ద ఎత్తున మంటలు అంటుకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని ట్యాంకర్ పేలకుండా జాగ్రత్తలు పాటిస్తూ మంటలను అదుపులోకి తేవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
