హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): పోలవరంపై ఏపీ ప్రభుత్వం మళ్లీ మాటమార్చింది. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌తో మన రాష్ట్రంలో ఏర్పడే ముంపు సమస్యపై సర్వే చేయించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే కొర్రీలు పెట్టింది. పోలవరం ముంపు సమస్యపై మంగళవారం హైదరాబాద్‌లో సెంట్రల్ వాటర్ కమిషన్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, గోదావరి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అధికారులు, పీపీఏ అధికారులు, ఏపీ సీఈలు తదితరులు పాల్గొన్నారు. పోలవరం రిజర్వాయర్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 45.72 మీటర్ల వద్ద ఉంటే తెలంగాణలో ఏర్పడే ముంపు ప్రమాదంపై తెలంగాణ అధికారులు సవివరంగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఇటు ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పైనా అభ్యంతరాలను వివరించారు. కిన్నెరసాని నది డీమారేషన్, భద్రాచలం ముంపు, మణుగూరు భారజల ప్లాంట్‌కు ముప్పు, ఆరు వాగుల ప్రభావంపై జాయింట్ సర్వే చేయించాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. అయితే, తెలంగాణ డిమాండ్ల మేరకు జాయింట్ సర్వేకి ఒప్పుకునే ప్రసక్తే లేదని ఏపీ మరోసారి కొర్రీలు పెట్టింది. తాము పోలవరం బ్యాక్‌వాటర్‌తో కిన్నెరసాని నదిపై పడే ప్రభావంపై మాత్రమే జాయింట్ సర్వే చేయిస్తామని తెలిపింది. పాత సర్వేలు ఇప్పటికే ఉన్నాయని, ఆ సర్వేలు సరిపోతాయని మొండివాదనలకు దిగింది. ఏపీ వాదనలను కొట్టిపారేసిన పీపీఏ.. థర్డ్ పార్టీతో స్వయంగా సర్వే చేయిస్తామని స్పష్టంచేసింది.
ఇవీ ప్రధాన డిమాండ్లు
పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం వల్ల తెలంగాణలో ఏర్పడే ముంపు, ఆయా ప్రాంతాలకు సరిహద్దుల నిర్ధారణపై కచ్చితంగా జాయింట్ సర్వే చేయించాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 954 ఎకరాల్లో ముంపు ప్రభావం ఉంటుందని స్పష్టంచేశారు. బ్యాక్‌వాటర్‌తో భద్రాచలంలో నదీ ప్రవాహ స్థాయిలను తేల్చాలని కోరారు. భద్రాచలం పట్టణంలోని 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు, భద్రాచలం ఆలయం వద్ద వచ్చే వరద ప్రవాహంపై అధ్యయనం చేయించాలని కోరారు. మణుగూరు భారజల కేంద్రం వద్ద ఏర్పడే ముంపునూ అధ్యయనం చేయాలని కోరారు. కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల డ్రైనేజీ సమస్యపై ఎన్జీటీ ఆదేశాల మేరకు డీమారేషన్ చేయించాలని స్పష్టం చేశారు.
మరో ఆరేడు స్థానిక వాగుల వద్ద ఏర్పడే వరద తీవ్రత, డ్రైనేజీ ప్రభావంపైనా సర్వే చేయించాలని స్పష్టంచేశారు. ఈ అంశాలకు సంబంధించి పూర్తి ఆధారాలనూ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేరొన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు దిగువన 36 వాగులు వచ్చి చేరుతున్నాయని, పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఆయా వాగులపై పడే ప్రభావంపై సర్వే చేయించాలని అధికారులు కోరారు. పోలవరం ముంపు ప్రభావంపై 2019లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఆధారంగా ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్‌ను ఆపాలని పీపీఏని అధికారులు కోరారు.