హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కనకరత్నం అవినీతి చిట్టా బయటపడుతున్నది. ఆయన అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కొందరు సి బ్బందితో కలిసి పెద్దమొత్తంలో అవినీతి చర్యలకు పాల్పడినట్టు తెలిసింది. ఒక్కో ప్రమోషన్‌కు ఒక్కో రేటు నిర్ణయించి మరీ.. కోట్లలో వసూలు చేసినట్టు సమాచారం. మే చివరివారంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ)గా ప దోన్నతి కల్పించాలని ప్రతిపాదిస్తూ 66 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (డీఈఈ) జాబితాను డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)కి ఈఎన్సీ పంపారు. ఈ లిస్టులోని ఒక్కొక్కరి నుంచి రూ.5-10 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ఏడుగురిని వసూళ్ల కోసం ఏర్పాటు చేసినట్టు సమాచా రం. ఇటీవలే తొమ్మిది మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లను అసిస్టెంట్ ఇంజినీర్/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతి కల్పించినందుకు ఒక్కొక్కరి నుంచి ఈఎన్సీ కనకరత్నం బృందం 5 లక్షల చొప్పున వసూ లు చేసినట్టు ఆరోపణలున్నాయి. నాన్ టెక్నికల్ విభాగానికి చెందిన సొంత వ్యక్తి ఈ వ్యవహారాలు చూస్తారని, ప్రతీచర్యలో ఆయనకు 10% వాటా వెళ్తుందని.. ఆ శాఖలో వినికిడి.
గడువు తీరిన కోర్టు ఆర్డర్ ఆధారంగా 1994 ఏఈఈ బ్యాచ్‌కు చెందిన ఓ వ్యక్తికి కనకరత్నమే ప్రమోషన్ కల్పించి.. గ్రేడ్-1 ఏఈఈగా నియమించినట్టు తెలిసింది. ఈ స్థానంలో రావడానికి 10 మంది అర్హులుండ గా, వారిని కాదని రూ.15 లక్షలు లంచం తీసుకొని, అక్రమంగా అనుయాయుడిని నియమించినట్టు బాధితులు ఆరోపించారు. దీంతో ఆయన ర్యాంక్ 438వ స్థానం నుంచి 291వ స్థానానికి పెరిగినట్టు చెప్తున్నారు. సివిల్ కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వచ్చే అవకాశాలు తగ్గిపోవడంతో ప్రమోషన్లపై ఈఎన్సీ దృష్టి పెట్టినట్టు తెలిసింది. 2-3 నెలల క్రితం కూడా సూపరింటెండెంట్ ఇంజినీర్లు 10 మందికి ప్రమోషన్లు కల్పించి ఆ శాఖ కీలక వ్యక్తి సహకారంతో 3 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. అయితే, ఇంజినీరింగ్ విభాగంలో నిజాయితీగా పనిచేస్తున్న కొంద రు.. ప్రమోషన్ల కోసం లంచాలు చెల్లించలేక వెనకబడుతున్నారని చర్చ జరుగుతున్నది.
గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పీఆర్ఆర్డీకి భారీగా నిధులు వస్తాయి. సమర్థవంతమైన పర్యవేక్షణ లోపం, అధికారులపై కఠినమైన విచారణ లేకపోవడం వల్ల ఈ శాఖలో అవినీతి కేసులు పెరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల కాలంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే 15 ఏసీబీ కేసులు నమోదయ్యాయంటే అవినీతి కార్యకలాపాలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈఎన్సీ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ దొరకడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంపై ఏసీబీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. కాంట్రాక్టుల కేటాయింపులు, అనుమానాస్పద లావాదేవీలు, బిల్లుల క్లియరెన్స్ కోసం జరిగే తెరవెనుక తతంగాలపై నిఘా కొనసాగుతున్నదని ఏసీబీ అధికారులు తెలిపారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి, ఏపీ మూలాలు ఉన్న కనకరత్నం.. ఈ ఏడాది మార్చిలో రిటైరయ్యారు. ఆయా శాఖల్లో విశ్రాంత అధికారుల కొనసాగింపును నిలిపివేయాలని, రిటైర్డ్ అధికారులను మళ్లీ తీసుకోవద్దని జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ సీఎంవోలో ప్రత్యేక పైరవీ చేసి, పెద్దమొత్తంలో ముడుపులు ముట్టజెప్పి.. పైస్థాయిలో కూడా ఒప్పించి.. తిరిగి అదేస్థానంలో కనకరత్నం సెటిలయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మళ్లీ తీసుకున్న రిటైర్డ్ అధికారుల్లో కనకరత్నమే తొలి ఉన్నతాధికారి కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) బదిలీ, పోస్టింగ్ కోసం ఏకంగా తన ఆఫీసులోనే రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో పీఆర్ ఇంజినీరింగ్ విభాగం సముదాయంలో కలకలం నెలకొన్నది.