మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రెండు మహాబహుబలి పంపులను ప్రారంభించారు. పంపింగ్ స్టేషన్లో నుంచి ఆన్ చేయగానే ఒక్కసారిగా నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్స్ నుంచి కృష్ణానది నీళ్ల జలధార ఉబికి వచ్చింది.
- నడపలేక చతికిలపడ్డ సర్కార్
- రెండున్నర టీఎంసీల జలాలు ఎత్తుతామని మొదట ప్రగల్భాలు
- పాలమూరు లిఫ్ట్‌లో కాంగ్రెస్ చతికిల..
- సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు
- రైతుల నోట్లో మట్టికొడుతున్న సర్కార్: శ్రీనివాస్‌గౌడ్
- పంపులు నిరంతరాయంగా నడుపాలి : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- కోతలకు ఇదే నిదర్శనం: లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నేతల అల్టిమేటమ్.. ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోతుండటంతో రైతుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందన్న భయంతో సర్కార్ ఎట్టకేలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండు పంపులను ప్రారంభించింది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రెండు మహాబహుబలి పంపులను ప్రారంభించారు. పంపింగ్ స్టేషన్లో నుంచి ఆన్ చేయగానే ఒక్కసారిగా నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్స్ నుంచి కృష్ణానది నీళ్ల జలధార ఉబికి వచ్చింది. రెండు పంపుల నుంచి కృష్ణా జలాలు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా జనం కేరింతలు కొట్టారు. ముచ్చటగా మూడు గంటలు మాత్రమే పంపులు నడిపారు. కరెంట్ ట్రిప్ కావడంతో మోటర్లు మొరాయించాయి. ఇన్కమింగ్ సప్లయ్‌లో ట్రిప్ ఏర్పడినందున మోటర్లకు సరిపడా విద్యుత్తు సరఫరా కాకపోవడంతో సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్య పంపులను బంద్ చేశారు. ఇదిలావుండగా కరెంట్ కోతల ఫలితంగానే మోటర్లు బంద్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్‌కు సంబంధించిన మోటర్లను ఆన్ ఆఫ్ పద్ధతిలో నడుపొద్దని ప్రభుత్వానికి సూచించినా చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. మరోవైపు పంపులను ఆన్‌చేసి మంత్రి జూపల్లి రైతులనుద్దేశించి మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని హామీ ఇచ్చి వెనుదిరిగిన కొద్దిసేపటికి పంపులు మొరాయించడం గమనార్హం.
కృష్ణా నీటి విడుదలపై సర్కార్ దోబూచులాట..
కృష్ణానదికి నెలన్నర క్రితం భారీగా వరద వచ్చింది. జూరాల నుంచి సుమారు 275 టీఎంసీల వరకు శ్రీశైలానికి విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 285 టీఎంసీలు. నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచ్చలవిడిగా జలదోపిడీకి పాల్పడటంతో ప్రస్తుతం 120 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. వెలుగొండ పోతిరెడ్డిపాడు 1, 2, సుజల స్రవంతి ముచ్చుమర్రి హంద్రీనీవా తదితర పథకాల ద్వారా చంద్రబాబునాయుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆదేశాలను తుంగలోకి తొక్కి విచ్చలవిడిగా జలదోపిడీకి పాల్పడ్డారు. ఇక్కడి నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తరలించారంటే ఏపీ జలదోపిడీ ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉన్న నీటిని వినియోగించుకోకుండా క్రాప్ హాలిడేలు ప్రకటించి వానాకాలంలో వేసుకున్న పంటలు మొత్తం ఎండిపోయేలా చేసింది. ఓవైపు రాయలసీమలో కృష్ణా నది జలాలతో కాలువలు, పంట పొలాలు పచ్చగా నిగనిగలాడుతుంటే.. తెలంగాణ వైపు కృష్ణా పరీవాహక ప్రాంతం మొత్తం పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. కృష్ణా నదిలో నీళ్లు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాజెక్టులకు నీటి విడుదల చేయడానికి ప్రభుత్వం దోబూచులాడటంతో ఉన్న నీరంతా ఏపీ యథేచ్ఛగా తరలించకుపోతున్నది.
ఇలా ప్రారంభించారు.. అలా ఆపేశారు
ప్రస్తుత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండుతుండటంతో రైతుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పాలమూరు ఎత్తిపోతల పంపులను ఆన్ చేయాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏకంగా అల్టిమేటమ్ జారీ చేశారు. అంతటితో ఆగక మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి నార్లాపూర్ పంప్ హౌస్‌ను.. పాలమూరు ఎత్తిపోతల పథకం హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించి వచ్చారు. ఒకటి,రెండు రోజుల్లో పాలమూరు పంపులు ప్రారంభించకపోతే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులతో ఆందోళన నిర్వహించి తామే పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం పాలమూరు పంపులను ప్రారంభించేందుకు అంగీకరించింది. అయితే ఈ లోపు రైతుల గోసలు పక్కకు పడేసి ఢిల్లీ పర్యటనలకు వెళ్లిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తీరిగ్గా వచ్చి పంపులను ఆన్ చేస్తామని ప్రకటించారు. మళ్లీ బీఆర్ఎస్ నేతలు 24 గంటల అల్టిమేటమ్ ఇవ్వడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మేగారెడ్డితో కలిసి పంపులను ఆన్‌చేశారు. సరిగ్గా మూడు గంటల తర్వాత ఈ పంపులు రెండు కూడా ఆఫ్ అయ్యాయి. కరెంటు కోతలతో ఈ పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మహా బాహుబలి పంపులను ఆన్ ఆఫ్ పద్ధతిలో నడిపిస్తే మోటర్లు చెడిపోయే అవకాశం ఉన్నదని ఇంజినీర్లు సైతం ఆవేదన చెందుతున్నారు.

రైతుల నోట్లో మట్టి కొడుతున్నరు : శ్రీనివాస్‌గౌడ్
కృష్ణా నదిలో ఉన్న నీళ్లను ఎత్తిపోసి రైతాంగాన్ని కాపాడాలని ప్రభుత్వానికి కొన్ని రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మంత్రి హడావిడిగా వచ్చి రెండు మోటర్లను ఆన్ చేసి పూర్తి స్థాయిలో నడపకుండా కేవలం మూడు గంటలు మాత్రమే నడిపి మళ్లీ బంద్ చేశారని ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ కక్షసాధింపు చర్యకు నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పంటలు సాగునీరు లేక ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. మంత్రి ప్రారంభించిన మోటర్లు మూడు గంటలకే బంద్ అయిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో మోటర్లు నడిపి నార్లాపూర్, ఎల్లూరు గుడిపల్లి రిజర్వాయర్లను నింపి.. కల్వకుర్తి చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయకపోతే భారీ ఎత్తున ఆందోళనలు లేవదీస్తామని హెచ్చరించారు.
పాలమూరు రైతులకు నీళ్లివ్వరా? : లక్ష్మారెడ్డి
రెండు నెలల నుంచి బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొస్తుండటం వల్లే చివరికి ప్రభుత్వం దిగివచ్చి పంపులను ఆన్ చేసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. కేవలం మూడు గంటలు నడిపి మళ్లీ ట్రిప్ అయిందని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కృష్ణా నదిలో నీళ్లు ఉన్నా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ముట్టడి పిలుపుతోనే లిఫ్ట్ పంపులు ప్రారంభం
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): నార్లాపూర్ రిజర్వాయర్‌ను ముట్టడిస్తామన్న బీఆర్ఎస్ హెచ్చరికలతోనే దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను ప్రారంభించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఈ ప్రక్రియ కేవలం ప్రచారానికే పరిమితం కాకూడదని స్పష్టంచేశారు. నార్లాపూర్ రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యమైన 6.5 టీఎంసీల నీరు నిండేంత వరకు పంపుల ద్వారా నీటి ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి సాగు, తాగునీరు అందేవరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటుందని, రైతుల హకుల సాధనలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

