పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో చేపట్టిన ప్రయత్నాలను కాంగ్రెస్ సర్కారు కొనసాగించకుండా చేతులెత్తేసింది. అనుమతుల కోసం వినతిపత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నదే తప్ప పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా కేంద్రం అనుమతుల ప్రక్రియను నిలిపివేసింది. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలేవరకూ ఇంతేసంగతులని తేల్చేసింది.
Palamuru Rangareddy | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ట్రిబ్యునల్ అవార్డు తేలేవరకు పీఆర్ఎల్ఐఎస్ డీపీఆర్‌ను పరిశీలించలేమని కేంద్ర జల్‌శక్తిశాఖ తేల్చిచెప్పింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదాను ఇవ్వాలని, ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు జనవరి 4న సీఎం రేవంత్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. అయితే సీఎం చేసిన వినతి, ప్రస్తుత పరిస్థితి, కేంద్ర జల్‌శక్తిశాఖ తీసుకున్న నిర్ణయాలు, తదిత వివరాలను ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్, సమాచారహక్కు చట్టం కార్యకర్త ఇనుగంటి రవికుమార్ ఆర్టీఐ ద్వారా కోరారు. అందుకు కేంద్ర జల్‌శక్తిశాఖ తాజాగా సమాధానమిచ్చింది.
తెలంగాణ సీఎం చేసిన వినతిపై జనవరి 29నే సీడబ్ల్యూసీ సమాధానమిచ్చిందని, అందుకు సంబంధించిన ఫైనల్ రిైప్లె కాపీతమ వద్ద అందుబాటులో లేదని వెల్లడించింది. అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించిన డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ అనుమతుల కోసం 2022 సెప్టెంబర్13న సమర్పించారని కేంద్ర జల్‌శక్తిశాఖ వెల్లడించింది. అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్నదని, అదే సమయంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను, ఏపీ, తెలంగాణ మధ్య పునఃపంపిణీ చేయాలని 2023 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తిశాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసిందని గుర్తుచేసింది. నూతన టీవోఆర్ ప్రకారం కృష్ణాజలాల పంపిణీ ట్రిబ్యునల్‌లో విచారణ అంశంగా ఉన్నదని వివరించింది. ప్రస్తుతం సబ్ జ్యుడీస్గా ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్ తుది అవార్డు వచ్చే వరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని తేల్చిచెప్పింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టును ప్రస్తుతం పీఎంకేఎస్‌వై (ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన), సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద చేర్చాలని చూస్తున్నట్టు సమాధానమిచ్చింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈఏసీ సభ్యులు సందేహాలను లేవనెత్తుతూ, నివేదికలను కోరుతూ వాయిదా వేశారు. ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరిస్తూ ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కనపెట్టారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ఈఏసీ కోరిన డాటాను అందించింది. 48వ సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. 49వ ఈఏసీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది.
ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కిచెప్పింది. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాల నివేదికలు పరిశీలించిన ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) ప్రాజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సంబంధిత మంత్రిత్వశాఖకు 2023 ఆగస్టు 10న సిఫారసు చేసింది. నాటి నుంచి ఆ దస్త్రం కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉన్నది. అయితే, ఈ ప్రాజెక్టు పనులపై ఏపీలోని కడప జిల్లాకు చెందిన పలువురు ఎన్జీటీని ఆశ్రయించడం, విచారణ చేపట్టిన ఎన్జీటీ ఒక్క పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనే దాదాపు రూ.600 కోట్ల జరిమాన విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర పర్యావరణశాఖ దీన్నే సాకుగా చూపి ఈసీ మంజూరుకు మోకాలడ్డుతున్నది. ఎన్జీటీ విధించిన జరిమాన నిధుల వినియోగానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రాజెక్టు వల్ల ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది? జరిమాన నిధులను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేయాలి? అన్న దానిపై నివేదించాలని ఆ కమిటీ మార్గదర్శకాలను జారీ చేసినట్టు సమాచారం. ఆ నివేదిక అనంతరమే ఈసీ మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తాజాగా సబ్ జ్యుడీస్ అంశాన్ని కూడా మరో కారణంగా చూపటం గమనార్హం. ప్రస్తుత సర్కారు అనుమతుల కోసం వినతిపత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నది తప్ప ఇప్పటివరకు ఆ దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టలేదని తెలుస్తున్నది.