Padi Kaushik Reddy : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి కాకుండా కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో పడ్డారని విమర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం శంభీపూర్ రాజుతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన.. అరికెపూడి గాంధీ గుండాగిరిపైన, సీఎం రేవంత్ రెడ్డిపైన విమర్శలు గుప్పించారు. ఆంధ్రా సెటిలర్స్‌ను తాను దూషించినట్లు గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘నాపట్ల ఆయనే దురుసుగా మాట్లాడి.. నా వ్యాఖ్యలను వక్రీకరించాడు. నేను ఆంధ్రావాళ్లను తిట్టిన అని ప్రచారం చేస్తున్నరు. వాస్తవానికి నేను ఆంధ్రాసెటిలర్లను అనలేదు. ఇది మా ఇద్దరి వ్యక్తిగత విషయం. నేను వ్యక్తిగతంగా అరికపూడి గాంధీని అన్న. ఆంధ్రా సెటిలర్ల కాలికి ముళ్లు గుచ్చుకుంటే తాను పంటితో తీస్తా అని మా నాయకుడు కేసీఆర్ స్వయంగా చెప్పారు. వీళ్ల చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నరు’ అని ఆరోపించారు.
‘రేవంత్‌రెడ్డి ఇప్పటికే హైడ్రా, బైడ్రా పేరుతో రోజుకో బిల్డింగును కూలగొట్టి హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నరు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నరు. ఇదంతా కుట్ర. హైదరాబాద్ ప్రజలు గమనించాలి. హైదరాబాద్ డెవలప్ కాకుండా కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ పదేళ్లలో హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌ను దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దారు. ఇయ్యాల రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు ట్రాప్‌లో పడి, ఇక్కడి నుంచి పెట్టుబడులను అమరావతికి డైవర్ట్ చేసే కుట్రలో భాగమైండ్రు. ఇదంతా హైదరాబాద్ ప్రజలు గమనించాలి’ అన్నారు.