హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. సాధ్యమైనంత వరకు అర్హత ఉన్న వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ను ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా టీకా డ్రైవ్లో మరో మైలురాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి కనీసం సింగిల్ డోస్ ఇచ్చినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో టీకాకు అర్హులైన వారు 2.87 కోట్ల మంది ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో గురువారం వరకు 2.50 కోట్ల మంది కనీసం సింగిల్ డోస్ తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 87 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇక 1,81,95,430 మొదటి డోసు తీసుకోగా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 68,37,327లుగా ఉంది.
18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారిలో 1,01,03,812 మంది మొదటి డోసు తీసుకున్నారు. 26,78,710 మంది రెండు డోసులు తీసుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్లో 1,27,82,522 మంది కనీసం సింగిల్ డోసు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 45 ఏండ్లకు పైబడిన వారిలో కనీసం సింగిల్ డోసు తీసుకున్న వారి సంఖ్య 1,11,59,142. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారు 74, 67,838మంది కాగా, రెండు డోసులు తీసుకున్నవారు 36,91,304 మంది.
కనీసం సింగిల్ డోసు తీసుకున్న హెల్త్ వర్కర్స్ సంఖ్య – 5.42 లక్షలు
కనీసం సింగిల్ డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ సంఖ్య – 5.48 లక్షలు