సుల్తాన్‌బజార్, జూలై 4: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీవీవీపీ పరిధిలోని దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 1,700 మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాల కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రస్తుతం టీవీవీపీకి కమిషనర్ లేకపోవడంతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూ ఆ బాధ్యతలు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆమె విధి నిర్వహణలో భాగంగా ఢిల్లీ వెళ్లడంతో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నదని, పిల్లలకు స్కూలు, కాలేజీల ఫీజులు కట్టాల్సి ఉన్నదని, వారికి ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉన్నదని, జీతాలు రాకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యలపై తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ కోఠిలోని టీవీవీపీ కమిషనర్ కార్యాలయంలో అధికారులను పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
ఇంకా చదవల్సిన వార్తలు
పెండింగ్ జీతాలు విడుదల చేయండి ; అధికారులకు జలమండలి కార్మికుల వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటవ తారీఖునే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉత్తమాటగా మిగిలాయని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకిష్టారెడ్డి అన్నారు. జలమండలిలో పనిచేస్తున్న దాదాపు 2,500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాలు ఇప్పటిదాకా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు జలమండలి ఎండీ, ఏఎండీ, డైరెక్టర్ ఫైనాన్స్, రెవెన్యూ సీజీఎంలను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను అమలుచేసి తమకు న్యాయం చేయాలని కోరారు.