హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ సభకు రాష్ట్రం నుంచి జనం రారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందే పసిగట్టిందా? అందుకే సరిహద్దు రాష్ర్టాలపై ఆ పార్టీ ఆధారపడిందా? అంటే ఆదివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో కనిపించిన వాహనాలు అవుననేలా కనిపిస్తున్నాయి. పది లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని భీకర ప్రకటనలు చేసిన బీజేపీకి తెలంగాణ జనం ప్రజల నుంచి కనీస స్పందన రాలేదు.
పరిస్థితి అర్థం చేసుకొన్న రాష్ట్ర బీజేపీ నేతలు జాతీయ నాయకుల ముందు తమ పరువు పోతుందని భావించి కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి జనాన్ని తరలించారు. పార్కింగ్‌లో ఆయా రాష్ర్టాలకు చెందిన వాహనాలు భారీగా దర్శనమివ్వటమే అందుకు నిదర్శనం. వాస్తవానికి మోదీ సభకు పది లక్షల మంది హాజరవుతారని బీజేపీ నేతలు చెప్పుకొన్నారు. బహిరంగ సభ జరిగిన పరేడ్ గ్రౌండ్ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు. ఎకరా స్థలంలో సాధారణంగా 4 నుంచి 5 వేల మంది మాత్రమే కూర్చుంటారు.
ఈ లెక్కన పరేడ్ గ్రౌండ్ మైదానంలో 1,10,000 నుంచి 1,40,000 వరకు మాత్రమే పడతారు. ఒక వేళ కుర్చీలు వేస్తే ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అదీ పోనూ ప్రధాని ప్రొటోకాల్ ప్రకారం ‘డీ’ మార్కింగ్ చేశారు. అంటే దాదాపు సభా వేదిక.. డీ మార్కింగ్‌కు దాదాపు 5 ఎకరాల స్థలం పడుతుంది. ఇలాంటప్పుడు పది లక్షలమంది జనం ఆ మైదానంలో ఎలా కూర్చుంటారు? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.