కోల్‌సిటీ, డిసెంబర్ 20 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ బుల్డోజర్’ రెండోరోజు ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం బాధితుల రోదనలతో హోరెత్తింది. రెండేండ్ల క్రితం అధికారులు అనుమతి ఇస్తేనే ఇక్కడ దుకాణాలు నిర్మించుకున్నామని, అప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదని, ఇప్పుడెందుకు కూల్చుతున్నారని బాధితులు అధికారులను నిలదీశారు.
జేసీబీ సిబ్బందికి ఎదురువెళ్లి గుండెలు బాదుకుంటూ తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘మా కుటుంబాలకు జీవనాధారమైన దుకాణాలే మీ అభివృద్ధికి అడ్డుగా ఉన్నాయా..? మా కన్నీళ్లను దాటుకొంటూ మా పొట్ట కొట్టడమే మీకు ఆనందమా..?’ అంటూ రోదించారు.
షాపు ముందు భాగం మాత్రమే తొలగిస్తామని నోటీసులు ఇచ్చి, పూర్తిగా దుకాణాలనే కూల్చుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రత్యామ్నాయ ఉపాధిమార్గం చూపకుండా రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేసి షాపులు ఏర్పాటు చేసుకున్నామని, అవి పోతే ఇప్పుడెలా బతికేదని కన్నీటిపర్యంతమయ్యారు. అనుమతి ఇచ్చింది వాళ్లే. కూలగొట్టేది వాళ్లే అంటూ సిరిశెట్టి జయసుధ-మల్లేశ్ దంపతులు ఆరోపించారు.
బాధితుల రోదనలు పట్టించుకోకుండా పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ సిబ్బంది ఎక్స్‌కవేటర్‌తో కట్టడాలను పూర్తిగా నేలమట్టంచేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా వెడల్పు, రోడ్ల సుందరీకరణలో భాగంగానే ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నిర్మాణాలను చట్ట ప్రకారమే తొలగిస్తున్నామని నగరపాలక టౌన్‌ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు.

మా ఊరిలో పొలం, నగలు అమ్మి ఇక్కడ షాపు కట్టుకున్న. అప్పుడు అధికారులు పర్మిషన్ ఇచ్చిన్రు. అప్పుడే అడ్డు చెప్తే వేరే చోట కట్టుకునేటోళ్లం కదా! రెండేండ్ల క్రితమే కట్టుకున్నం. షాపు వెనుకాల, ముందు మాత్రమే తీస్తామని చెప్పిన్రు. ఇప్పుడే మొత్తం షాపే కూలగొట్టిన్రు. రేపటి సంది ఎట్ల బతికేది? మా బతుకులను ఆగం చేయడానికే వచ్చిన్రా..? కనికరం లేకుండా కూలగొట్టుమని ఎవరు చెప్పిన్రు? మేం రోడ్డునపడితే వాళ్ల కండ్లు సల్లబడుతాయా..?
– సిరిశెట్టి జయసుధ, బాధితురాలు