మునుగోడు, అక్టోబర్ 8: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోవర్ట్ అని, కాంగ్రెస్లో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెడుతున్న ఆయనను తక్షణమే బహిష్కరించాలని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు, పార్టీ నాయకులు పోలగోని విజయలక్ష్మి భర్త సైదులుగౌడ్ డిమాండ్ చేశారు. 24 గంటల వ్యవధిలో కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకోని పక్షంలో తామంతా కాంగ్రెస్కు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీచేశారు. శనివారం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పేరును ప్రపోజల్ చేసింది వెంకట్రెడ్డే అయితే, ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేండ్లుగా బీజేపీకి టచ్లో ఉన్నానని ఆయన తమ్ముడు రాజగోపాల్రెడ్డి అంగీకరిస్తున్నందున, ఇప్పుడు అన్న కూడా కాంగ్రెస్లో ఉంటూ కోవర్టుగా వ్యవహరిస్తున్నారనే అనుమానం పార్టీ క్యాడర్లో నెలకొన్నదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాక రాజగోపాల్ రాజీనామా చేయలేదని, కుటుంబానికి సరిపడా నిధులు సమకూర్చుకోవడానికే రాజీనామా చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అవకాశం దొరికితే యావత్ తెలంగాణను అమ్ముకుంటున్నారని విమర్శించారు.