హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 2,86,051 మంది ఓఎంఆర్ షీట్ల డిజిటల్ కాపీలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. www.tspsc.gov.in వెబ్సైట్లోకి వెళ్లగానే ఓఎంఆర్ షీట్ డౌన్‌లోడ్‌కు ప్రత్యేకంగా లింక్ ఇచ్చింది. ప్రిలిమనరీ కీ తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్‌కి వేర్వేరుగా రెండు లింకులు ఏర్పాటు చేశారు.
ఒకరి ఓఎంఆర్ షీటు మరొకరు చూడకుండా ఉండేందుకు టీఎస్పీఎస్సీ ఐడీ, హాల్ టికెట్, పుట్టిన తేదీ అన్నీ ఎంటర్ చేస్తేనే లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు. ప్రిలిమినరీ కీని మాత్రం అందరికీ అందుబాటులో ఉంచారు. ఓఎంఆర్ షీట్లు నవంబర్ 29 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామంద్రన్ తెలిపారు. అభ్యంతరాలకు ఐదురోజుల(అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు) అవకాశమిచ్చారు. అభ్యంతరాలు తెలిపేందుకు ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ లింక్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించారు. నవంబర్ 29 తర్వాత ఓఎంఆర్ షీట్లు, నవంబర్ 5 తర్వాత అభ్యంతరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే www.tspsc.gov.inలో సంప్రదించాలని సూచించారు.
‘కీ’ని చెక్ చేసుకోవడం ఇలా..?
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్లి ప్రిలిమనరీ కీ లింకుపై క్లిక్ చేయాలి. దీంట్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్, మాస్టర్ కీ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఈ రెండింటిలో క్వశ్చన్, కీలోని జవాబును సరిపోల్చుకొని ఆ తర్వాత అభ్యర్థి వద్ద ఉన్న క్వశ్చన్ పేపర్, డౌన్లోడ్ చేసుకొన్న ఓఎంఆర్ షీట్‌లోని జవాబుతో సరిచూసుకోవాలి.