హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ మార్కెటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘విజయ’ బ్రాండ్ వంట సరుకులను కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయించాలని ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు బిగ్ బాస్కెట్, జియో మార్ట్, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టోతో త్వరలోనే ఒప్పందం చేసుకోనున్నది.
ఈ మేరకు ఆయా సంస్థలతో ఆయిల్‌ఫెడ్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులోగా విజయ బ్రాండ్ సరుకులను ఆన్లైన్ మార్కెటింగ్‌లో అందుబాటులోకి తేనున్నట్టు ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు. ఇప్పటికే ఆయిల్‌ఫెడ్ విజయ బ్రాండ్ పేరుతో సన్‌ఫ్లవర్, వేరుశనగ, రైస్‌బ్రాన్, పామాయిల్, దీపం, గానుగ కొబ్బరి నూనెలతో పాటు హెచ్ఎంటీ, సోనామసూరి సన్న బియ్యం, పప్పులు ఇలా 30 రకాల వరకు సరుకులను బహిరంగ మార్కెట్లో వినియోగదారులకు అందిస్తున్నది.
గతంలో నూనెలు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇటీవల వంట సరుకులను కూడా ప్రవేశపెట్టింది. దీంతో విజయ సరుకులకు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని సురేందర్ వెల్లడించారు. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా తమ డీలర్లకు ఎలాంటి నష్టం ఉండబోదని, వారి ద్వారానే మార్కెటింగ్ చేయనున్నుట్టు పేర్కొన్నారు.