e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home Top Slides పసి మనసులతో విష రాజకీయం

పసి మనసులతో విష రాజకీయం

  • అభం-శుభం ఎరుగని చిన్న పిల్లలతో రాజకీయ క్రీడ
  • 14 ఏండ్ల బాలుడితో సీఎంపై అసభ్య పోస్టింగులు
  • మైనర్లపై కేసులు పెట్టరని రాష్ట్ర బీజేపీ నేతల ధీమా!
  • కరీంనగర్‌ బాలుడిని గుర్తించిన సైబర్‌ క్రైం పోలీసులు
  • బాలుడికి పోలీసులు నోటీసులు ఇచ్చిన వెంటనే
  • బెయిలిచ్చేందుకు బీజేపీ నేత కరుణసాగర్‌ హడావుడి
పసి మనసులతో విష రాజకీయం


గతంలోనూ ఇలానే ఓ బాలుడి అమాయకత్వాన్ని రాజకీయంగా వాడుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై అసభ్య ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్నది. దీనిపై టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సెల్‌ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ మార్ఫింగ్‌ వీడియోలు, పోస్టులు పెడుతున్నది ఐటీ రంగంలో తలపండిన నిపుణుడు కాదు! 7వ తరగతి చదువుతున్న ఓ పద్నాలుగేండ్ల పిల్లగాడు!

ఇంకొంత లోతుకు వెళ్లి పరిశీలిస్తే పోలీసులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యే విషయాలు తెలిశాయి. ఆ బాలుడి పేరుతో ఒక యూట్యూబ్‌ చానల్‌,9 జీమెయిల్‌ ఖాతాలు, 33 ఇన్‌స్టాగ్రాం ఖాతాలతోపాటు.. 15 ఫేస్‌బుక్‌ అకౌంట్లు కూడా ఉన్నాయి! వీటిలో కొన్ని ఖాతాలు అమ్మాయిల పేర్లతో నడుస్తున్నాయి! అత్యంత నైపుణ్యంతో కేసీఆర్‌ వీడియోలను మార్ఫింగ్‌ చేసి ఈ అకౌంట్లలో పోస్ట్‌ చేయడం ఆ పిల్లాడికి సాధ్యమేనా?

ఆ బాలుడి వివరాలు నమస్తే తెలంగాణ వద్ద ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో దిగిన ఫొటోలూ ఉన్నాయి. కానీ.. ఆ బాలుడి భవిష్యత్తును, అతడి తల్లిదండ్రులకు సమాజంలో కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిని బయటపెట్టడం లేదు. ఇచ్చంత్రం ఏమిటంటే.. పోలీసులు ఈ వ్యవహారంలో సదరు బాలుడిని గుర్తించి, అరెస్టు చేయగానే.. బెయిలిచ్చేందుకు బీజేపీ నాయకుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడంటే.. ఈ బాలుడు ఎవరి చేతిలో సమిధగా మారాడో వేరే చెప్పాలా?

పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పూవుల్లారా, అయిదారేడుల పాపల్లారా! మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా!..అంటూ చిన్నారుల ప్రపంచాన్ని శ్రీశ్రీ విశ్లేషిస్తాడు పసివాళ్లంటే ఇంతటి అమాయకులు. అల్లరి.. ఆటలు తప్ప మరేమీ తెలియని వారు.. బాధ్యతలు, బరువులు ఎరుగనివారు.. ఇలాంటి పసి మనసుల్లో విషబీజాలు నాటి.. ప్రత్యర్థిపై దిగజారుడు ప్రచారానికి నిర్లజ్జగా వాడుకోవటాన్ని రాజకీయమంటారా?
ఒక మైనర్‌చేత సోషల్‌ మీడియాలో పుట్టగొడుగుల్లా ఖాతాలు తెరిపించి.. ప్రజలెన్నుకున్న ఒక ముఖ్యమంత్రిపై తప్పుడు రాతలు.. తప్పుడు ఫొటోలు.. తప్పుడు వీడియోలను గుప్పించి రాజకీయంగా పబ్బం గడుపుకోవడాన్ని ఏమని నిర్వచించాలి?

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్‌ 11 (నమస్తే తెలంగాణ): సోషల్‌ మీడియాలో ఏదైనా పార్టీ కార్యకర్తలు, లేదా వాటి సోషల్‌మీడియా విభాగాలు నిబంధనలు ఉల్లంఘించి పోస్టులు పెడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే.. ఆ పని మైనర్లతో చేయిస్తే తమకేమీ ఇబ్బంది ఉండబోదని భావించారేమో.. ఒక పసివాడిని బలి చేసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. చదువుకొనే వయసులో ఉన్న పిల్లవాడికి మాయమాటలు చెప్పి.. పార్టీ అధినేతలతో ఫొటోలు దింపి.. అతని చేత సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్మేలా చేయడం వారి రాజకీయ పతనావస్థకు నిదర్శనంగా నిలుస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భావితరాలను ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ నేతలు సమాజం అసహ్యించుకొనేలా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నీతిబాహ్యమైన చర్యలతో పిల్లలను చెడువైపు ప్రేరేపిస్తే.. రేపు అదే పిల్లలు చట్టానికే సవాలుగా మారితే అందుకు బాధ్యులెవరు? ఆ పిల్లలపై కోటి ఆశలు పెట్టుకొన్న తల్లిదండ్రుల మానసిక వేదనను తీర్చేదెవరు? రాజకీయ పార్టీలు సిద్ధ్దాంతాలు.. విధానాలపై పరస్పరం విమర్శలు చేసుకుంటాయి. అది రాజకీయంగా సహజం. కానీ రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థి పార్టీని, నాయకుడిని ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు, దూషణలకు పాల్పడటం నిస్సందేహంగా దిగజారుడుతనమే. అందులోనూ అందనంత అథఃపాతాళానికి ఇవాళ రాష్ట్ర బీజేపీ నేతలు దిగజారారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పసి మనసులతో విష రాజకీయం

ఆన్‌లైన్‌ క్లాసులకోసం ఫోన్‌ కొనిస్తే..
కరీంనగర్‌ జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ తరగతులు కావడంతో తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారు. వాస్తవానికి బాలుడి తండ్రిగానీ కుటుంబంలోని ఇతర సభ్యులు గానీ ఏ పార్టీకీ చెందినవారు కాదు. కనీసం సానుభూతిపరులు కూడా కాదు. సాంకేతిక అంశాల్లో సదరు బాలుడు చురుకుగా ఉన్నట్లు గుర్తించిన స్థానిక బీజేపీ నేతలు అతడిని తప్పుదోవ పట్టించారని తెలుస్తున్నది. సీఎం కేసీఆర్‌పై అసభ్యకర పోస్టింగులు చేసేలా ప్రోత్సహించడం, అందుకు బీజేపీ సోషల్‌ మీడియా విభాగం పూర్తి సహకారం అందించడంతో ఆ పని.. సదరు బాలుడికి ఓ వ్యాపకంగా మారిపోయిందంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా అదేపనిగా సీఎం కేసీఆర్‌కు సంబంధించి మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను పోస్ట్‌చేస్తున్నాడు. రాజకీయంగా సీఎం కేసీఆర్‌ను గానీ ప్రభుత్వ విధానాలను కానీ రాజకీయ నాయకులో, ఆ అంశాలపై అవగాహన ఉన్నవారో విమర్శించడం రాజకీయ స్వేచ్ఛ అనుకోవచ్చు. కానీ.. కేసీఆర్‌ అంటే ఎవరో.. ఆయన చేసిన పోరాటం ఏమిటో.. చేస్తున్న పరిపాలన ఎలాంటిదో కనీస అవగాహన కూడా లేని ఓ చిన్నపిల్లగాడు.. ఇలా వ్యక్తిగతంగా అసభ్యకర మార్ఫింగ్‌ వీడియోలు.. అందునా ఏ మాత్రం సంబంధం లేనివి పెట్టడం, వాటిని రాష్ట్ర బీజేపీ నేతలు, వారి సోషల్‌ మీడియా వారు ట్రోల్‌ చేయడం అనేక సందేహాలకు తావిస్తున్నది. తన పోస్టులను రాష్ట్ర బీజేపీ శ్రేణులు ట్రోల్‌ చేస్తుండటంతో సదరు బాలుడు తాను చేస్తున్న పనిని హీరోయిజంగా భావించాడు.

ఇలా బయటపడింది..
ఈ పోస్టులపై నెల కిందట ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐపీ నంబర్లతో అన్వేషించిన పోలీసులు.. ఏడో తరగతి చదివే బాలుడు ఇవన్నీ చేస్తున్నాడని రెండురోజుల కిందట తేలడంతో అవాక్కయ్యారు. బాలుడిని గుర్తించేవరకు ఏదో ఒక రాజకీయపార్టీ నాయకులే ఇదంతా చేస్తున్నారని భావించాం తప్ప అభంశుభం తెలియని బాలుడు ఒక పార్టీ నాయకుల ప్రేరణతో చేస్తున్నాడని ఊహించలేకపోయామని పోలీసు అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

మొత్తం 56 ఖాతాలు
సదరు బాలుడు గత కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్‌పై అసభ్యకర పోస్టులు పెట్టేందుకు ఏకంగా 56 ఫేక్‌ అకౌంట్లను తెరిచాడు. తొమ్మిది జీమెయిల్‌, 33 ఇన్‌స్టాగ్రాం, 15 ఫేస్‌బుక్‌ అకౌంట్లను అందునా అధికంగా బాలికల పేరిట ఉన్నాయి. వీటి ద్వారా అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ నేతలు, సోషల్‌ మీడియా విభాగం పరోక్షంగా వీటిని ట్రోల్‌ చేస్తుండటంతో వీక్షకుల సంఖ్య పెరిగింది. ఈ పరిణామం ఆ బాలుడిని మరింత ప్రోత్సహించినట్టయింది. దీంతోపాటు సదరు బాలుడు తన పేరిట ఉన్న యూట్యూబ్‌ అకౌంట్‌ ద్వారా డబ్బులు ఆర్జించేందుకుగాను (మానిటైజేషన్‌) ఈ అసభ్యకర వీడియోలను వాడుకోవడం మొదలుపెట్టాడని తెలుస్తున్నది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం, ప్రభుత్వ విధానాలపై బాలుడికి సరైన అవగాహన కూడా లేదు. కానీ బీజేపీ నేతల కారణంగా చదువు పక్కనపడేసి దీనిపైనే ధ్యాస పెట్టాడు. ఇదంతా బాలుడి తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం. పోలీసులు బాలుడిని గుర్తించి, నోటీసులు జారీ చేశాకగానీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియలేదు.

సాదాసీదా పిల్లాడికి ఐఫోన్‌?
పోలీసులు గుర్తించిన బాలుడిని రాష్ట్ర బీజేపీ నాయకులు ట్రాప్‌ చేశారనే ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలూ కనిపిస్తున్నాయి. గతంలో ఆ బాలుడిని నేతలు పార్టీ రాష్ట్ర నేత వద్దకు తీసుకుపోయి ఆయనతో ఫొటోలు తీయించారని సమాచారం. పోలీసులు బాలుడిని గుర్తించిన వెంటనే రాష్ట్ర బీజేపీ నేత, న్యాయవాది కరుణాసాగర్‌ హుటాహుటిన పోలీసులను కలిసి బెయిల్‌ దరఖాస్తుకు ప్రయత్నించడం అనుమానాలను పెంచుతున్నది. పోలీసులు బాలుడిని అరెస్టు చేయకుండా నోటీసులే జారీచేయడంతో కరుణాసాగర్‌ బెయిల్‌ దరఖాస్తు చేయకుండా వెళ్లిపోయారు. సదరు బాలుడు రాష్ట్ర బీజేపీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా చేస్తున్నాడని ఈ పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయని పలువురు అంటున్నారు. బాలుడి కుటుంబం ఆర్థికంగా అంత సంపన్నమైనదికాదు. కానీ.. అతడు ఖరీదైన ఐ-ఫోన్‌ వాడుతున్నాడు. పదుల సంఖ్యలో నకిలీ ఖాతాలను సృష్టించి సీఎం లక్ష్యంగా అసభ్యకర వీడియోలు పోస్టు చేయడమంటే కచ్చితంగా ఇది బీజేపీ ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్రగానే స్పష్టమవుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బాల్యంపై బీజేపీ కన్ను
బీజేపీ రాష్ట్ర నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదని తెలుస్తున్నది. కొన్నిరోజుల కిందట కూడా బీజేపీ నేతలు ఒక బాలుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. బాన్సువాడలో కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ ఎంపీ అరవింద్‌ ప్రసంగిస్తున్న సమయంలో వెనక ఒక పదేండ్ల బాలుడు నిలబడి అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. నిజానికి ఆ పార్టీ నేతలు మాట్లాడిన అంశాలపై సదరు బాలుడికి కనీస అవగాహన లేదు. ఆ వయసు కూడా కాదు. కానీ ఆ రోజు అతడు చేసిన హడావుడిని సైతం రాజకీయంగా వాడుకోవాలనే దురాశతో ఏకంగా ఆ బాలుడిని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకువచ్చి భోజనం చేయించారు. సెల్ఫీలు దిగారు. వాస్తవానికి ఈ వయసులో మంచిగా చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి అంటూ హితవు చెప్పాల్సిన స్థానంలో ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులు ఇలా రాజకీయ లబ్ధి కోసం చిన్నారులను వాడుకోవడంపై అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఏడో తరగతి చదివే బాలుడు ఇవన్నీ చేస్తున్నాడని తేలింది. బాలుడిని గుర్తించేవరకు ఏదో ఒక రాజకీయపార్టీ నాయకులే ఇదంతా చేస్తున్నారని భావించాం తప్ప అభంశుభం తెలియని బాలుడు ఒక పార్టీ నాయకుల ప్రేరణతో చేస్తున్నాడని ఊహించలేకపోయాం.

  • పోలీసు అధికారులు

పిల్లగాడికి 12 ఏండ్లు చదివేది 7వ క్లాసు
జీమెయిల్‌ ఖాతాలు : 9
ఇన్‌స్టాగ్రాం ఖాతాలు : 33
ఫేస్‌బుక్‌ ఖాతాలు : 15

Advertisement
పసి మనసులతో విష రాజకీయం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement