హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : జనగణనలో బీసీ గణన కాలమ్ చేర్చకుంటే బీజేపీ సర్కార్‌కు గుణపాఠం తప్పదని ఓబీసీ సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు డిసెంబర్14న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఓబీసీ సంఘాల జాతీయ సదస్సు గురువారం జరిగింది. సదస్సులో అఖిలపక్ష పార్టీల నేతలతోపాటు అన్ని రాష్ర్టాల నుంచి బీసీ నేతలు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ జనగణనపై అఖిలపక్ష స మావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ కాలమ్ చేర్చాలని, లేదంటే జనగణనను బహిషరిస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో చలోఢిల్లీ, పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సదస్సులో రాజా, రామకృష్ణ, హనుమంతరావు, పప్పూయాదవ్, యోగేంద్రయాదవ్, అరుణ్, కేశనశంకర్రావు, ఇక్బాల్హన్సారి, ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.