హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీం వద్దు.. సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ విధానమే ముద్దు’ అనే నినాదంతో నవంబర్ 25న ‘చలో ఢిల్లీ’ని తలపెట్టినట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం(ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ వెల్లడించారు. 10 లక్షల మంది ఉద్యోగులతో ఢిల్లీ లో కదం తొక్కుతామని శనివారం ప్రకటించారు. ఢిల్లీలో తలపెట్టిన ఈ భారీ నిరసన లో దేశవ్యాప్తంగా గల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, రైల్వే, ఆర్డినెన్స్ తదితరశాఖల ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు.
యూపీఎస్ ఒక విఫల పథకమని, ఈ స్కీంలో చేరేందుకు మూడుసార్లు గడువు పొడిగించిందని, ఇప్పటివరకు 3-4% మం ది మాత్రమే చేరారని గుర్తుచేశారు. ఆర్టీఈ చట్టాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్టీఈ యాక్ట్‌ను సవరించాలని, పాత పింఛన్ పునరుద్ధరించాలన్న రెండు డిమాండ్లతో ‘చలో ఢిల్లీ’ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నుంచి వెయ్యికిపైగా ఉద్యోగులు పాల్గొంటారని తెలంగాణ సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ తెలిపారు.