వికారాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ)/బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతుల ఉద్యమిస్తున్నారు. నెల రోజులుగా ప్రతిరోజూ కడా కార్యాలయంతోపాటు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రాణాలైనా ఇస్తాం కానీ ఎన్నో ఏండ్లు గా మా కుటుంబాలు ఆధారపడిన భూములను మాత్రం ఇచ్చేది లేదు’ అని తెగేసి చెప్తున్నారు. కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు వస్తే తమ బతుకులు ఆగం ఆవుతాయని, ముంబై, దుబాయ్‌లకు వలస పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాము వేసిన ఓట్లతో సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. తమను రోడ్డు పాలు చేస్తామంటే ఊరుకునేది లేదని, తగిన బుద్ధి చెప్తామ ని హెచ్చరిస్తున్నారు. అసైన్డ్ భూములకు ఇచ్చిన విధంగానే పట్టా భూములకు కూడా అంతే నష్టపనరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేస్తున్నా రు. పట్టా భూములకు రెండింతలు అధికంగా నష్టపరిహారం ఇస్తామని స్థానిక అధికారులు సర్ది చెప్తున్నా శాంతించడం లేదు. జిల్లా కలెక్టర్ నుంచి గానీ, కడా అధికారి నుంచి కానీ అధికారికంగా ప్రకటన రాకపోవడంతో భూములిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఫార్మా విలేజ్‌కు సేకరించే పట్టా భూములకు ఇచ్చే నష్టపరిహారంతోపాటు ఫార్మా విలేజ్‌తో ఎలాంటి కాలుష్య సమస్యలు ఏర్పడవని ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చేంత వరకు భూములిచ్చేది లేదని, భూముల వద్దకు వస్తే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై ఆది నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఫార్మా విలేజ్ కోసం హకీంపేట, పోలేపల్లి, లగచెర్ల గ్రామాల పరిధిలోని 1,274.25 ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టా భూములను సేకరించాలన్న నిర్ణయంపై రైతులు భగ్గుమంటున్నారు. తరతరాల నుంచి భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు కంపెనీల కోసం భూములిచ్చి తాము ఎలా బతకాలని నిలదీస్తున్నారు. ఫార్మా విలేజ్ వల్ల గ్రామాల్లో నీటి, వాయు కాలుష్యం పెరుగుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, పంటలు పండే పరిస్థితి ఉండదని రైతులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మా కంపెనీల కోసం సాగు భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. ఇప్పటికే రైతులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. తమ గోడును కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి కూడా రైతులు తీసుకెళ్లారు. మూడు గ్రామాల రైతులు దుద్యాల తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీలు నిర్వహించగా, మంగళవారం పోలేపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు.
ఫార్మా విలేజ్‌పై రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోలేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 67లో 130 ఎకరాలు, హకీంపేటలోని 252 సర్వే నంబర్లో 366 ఎకరాలు, లగచెర్లలో 102 సర్వే నంబర్లో 140 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ప్రభుత్వ భూమి సరిపోక పోవడంతో ప్రభుత్వ, పట్టా భూములను కలిపి మూడు గ్రామాల పరిధిలో మొత్తం 1274.25 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. హకీంపేటలో 505.37 ఎకరాలు, పోలేపల్లిలో 130 ఎకరాలు, లగచెర్లలో 643 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే లగచెర్ల గ్రామ పరిధిలోని 632.26 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల పట్టా భూములను సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫార్మా విలేజ్ కోసం సాగు భూములను లాక్కొని మమ్మల్ని బజారు పాలు చేయొద్దు. ఏడాదికి మూడు పంటలు పండించుకుని భూములనే నమ్ముకుని చాలామంది పేద రైతులు బతుకుతున్నారు. ఇప్పుడు అలాంటి భూములను కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలకు ఇస్తే మేమంతా ఏం కావాలి.
ఫార్మా విలేజ్ మాకు వద్దే వద్దు. మా భూములు మాకే ఉండాలి. సాగు భూములను కంపెనీలకు ఇచ్చి మేమెలా బతకాలి. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యంతో మా ప్రాణాలకే నష్టం కలుగుతుంది.
భూములపైనే ఆధారపడి బతికే పేద రైతులం. వాటిని తీసుకుంటే మేం బతకలేము. భూములకు బదులుగా ఎన్ని రూ. లక్షలు ఇచ్చినా మాకు వద్దు. సాగు భూములను తీసుకుని రైతుల పొట్ట కొట్టొద్దు.. ఫార్మా కంపెనీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఫార్మా కంపెనీ వద్దని గతంలో కలెక్టర్‌తోపాటు కడా ప్రత్యేకాధికారికి, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి కూడా చెప్పాం.