e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home Top Slides కరోనా కన్నెత్తని ఊరు!

కరోనా కన్నెత్తని ఊరు!

కరోనా కన్నెత్తని ఊరు!
  • దమ్ము చూపిన దమ్మయ్యపేట
  • ఒక్క కేసుకూడా రాని జగిత్యాల జిల్లాలోని పల్లె
  • కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు
  • పంచాయతీ తీర్మానాలు పక్కాగా పాటిస్తున్న జనం
  • శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు
  • వారానికి రెండు సార్లు ఊరంతా శానిటైజేషన్‌

ఆ ఊళ్లో అంతా మాస్క్‌ ధరిస్తారు. భౌతికదూరం పాటిస్తారు. నిత్యం పరిశుభ్రంగా ఉంటారు. ఎక్కువమంది గుమిగూడరు. అత్యంత ముఖ్యమైన పని ఉంటే తప్ప పొలిమేర దాటరు. ఒకవేళ ఎవరైనా ఆ ఊరికి వస్తే.. సాయంత్రానికల్లా మళ్లీ వెళ్లిపోవాల్సిందే. పెండ్లిళ్లు లేదా శుభకార్యాలు జరిగితే కొద్ది మంది దగ్గరి బంధువులే హాజరవుతారు. తీర్మానాలు చేసుకోవడమే కాకుండా.. వాటిని పక్కాగా అమలు చేస్తున్న కారణంగా ఆ ఊరిని ఇంత వరకు కరోనా కన్నెత్తి కూడా చూడలేక పోయింది. మొదటివేవ్‌లోనే కాదు.. రెండో వేవ్‌లోనూ భద్రంగా ఉంటూ.. ఆదర్శంగా నిలుస్తున్నది.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని దమ్మయ్యపేట
జగిత్యాల, మే 13 (నమస్తే తెలంగాణ)/ మల్యాల: కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తున్నది. పల్లె నుంచి మొదలుకొని మహానగరాల వరకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులతో అట్టుడికిపోతుంటే.. ఓ మారుమూల గ్రామం మాత్రం ఒక్క కేసు సైతం లేకుండా నిశ్చితంగా ఉన్నది. కరోనా నిబంధనలను కఠినంగా, కచ్చితంగా అమలుచేసుకుంటూ గ్రామప్రజలు నిర్భయంగా ఉంటున్నారు. ఉదయం, సాయంత్రం ఉపాధి హామీ పనులకు వెళ్తూ నిమ్మళంగా బతుకుతున్నారు. ఏడాదిగా వారు పెట్టుకున్న కట్టుబాట్లు, తీసుకున్న జాగ్రత్తలతో మొదటి విడుతలోనే కాదు.. రెండో విడుతలోనూ ఒక్క పాజిటివ్‌ కేసు నమోదుకాలేదు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌కు దమ్మయ్యపేట అనుబంధ గ్రామంగా ఉండేది. సీఎం కేసీఆర్‌ 500 జనాభా దాటిన పల్లెలను పంచాయతీలుగా మార్చడంతో దమ్మయ్యపేట కూడా 2017లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కొడిమ్యాల-గోవిందరాం రహదారి నుంచి కిలోమీటర్‌ దూరంలో ఉండే దమ్మయ్యపేటకు మూడువైపులా కొండలు, గుట్టలే ఉంటాయి. 216 గడపలు ఉన్న ఈ గ్రామ జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) 868. వీరిలో 439 మంది పురుషులు, 429 మంది మహిళలు. 8 వార్డులుగా విభజించబడిన గ్రామానికి నర్సయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రభుత్వం మహేశ్వరిని పంచాయితీ కార్యదర్శిగా నియమించింది.

కరోనా మొదలు నుంచే కట్టడి

2020 మార్చిలో కరోనా విజృంభణ ప్రారంభమైన సమయంలోనే దమ్మయ్యపేట గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుబెట్టారు. గ్రామసభ సమావేశం నిర్వహించుకొని ప్రత్యేక తీర్మానాలు చేసుకున్నారు. గ్రామంలో ప్రజలు గుమికూడవద్దని, భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించడంతోపాటు, శానిటైజర్‌ లేదా సబ్బులతో చేతులను శుభ్రం చేసుకోవాలని నిబంధనలు విధించుకున్నారు. గ్రామంలో వీలైనంతగా శుభకార్యాలు వాయిదావేసుకోవాలని.. ఒకవేళ జరిగినా గ్రామస్థులెవరినీ పిలువకుండా, కొద్దిమంది బంధువులతోనే నిర్వహించుకోవాలని తీర్మానించుకున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే పంచాయతీకి సమాచారమివ్వాలని పేర్కొన్నారు. గ్రామంలో వారంలో రెండుసార్లు శానిటేషన్‌ చేసేలా చర్యలు చేపట్టారు. అత్యవసరమైతేనే తప్ప ఇతర గ్రామాలకు వెళ్లాలని, ఇతర గ్రామాల నుంచి ఎవరు వచ్చినా భౌతికదూరం పాటించడంతోపాటు, సాయంత్రానికి వెళ్లిపోయేలా చూడాలని సూచించారు. ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించడంతో మొదటి విడుతలతో గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాలేదు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

రెండో విడుత మరింత పకడ్బందీగా..

దమ్మయ్యపేటలో నిబంధనల కారణంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని తెలిసిన కొందరు పట్టణాల్లో కూలీ చేసుకొని బతుకుతున్న కొందరు స్వగ్రామానికి చేరుకున్నారు. వారు కూడా గ్రామ పంచాయతీ నిబంధనలను కచ్చితంగా పాటించడం ప్రారంభించారు. గ్రామస్థులతోపాటు, పట్టణం నుంచి తిరిగివచ్చిన వారు ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే దేశంలో కరోనా రెండోవేవ్‌ ఉధృతం కావడంతో మరోసారి అప్రమత్తమయ్యారు. గతంలో పాటించిన నిబంధనలను తిరిగి కఠినంగా ఆమల్లోకి తెచ్చారు. వారి నిర్ణయం, వారిలో ఉన్న అంకితభావం ఫలించింది. ఇంతవరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. 216 ఇండ్లలో జ్వర సర్వే నిర్వహించగా ఒకే ఒక్కవ్యక్తికి మాత్రమే కొద్దిపాటి లక్షణాలు కనిపించాయి. అతడిని వెంటనే కొడిమ్యాలకు తీసుకువెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చింది. కరోనాతో ఊర్లన్నీ అల్లాడిపోతున్న తరుణంలోనూ 200 మంది దమ్మయ్యపేట ప్రజలు తమ గ్రామ శివారుల్లో ఉదయం, సాయంత్రం నిశ్చింతగా ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నారు.

సమిష్టి కృషితోనే సాధ్యమైంది

ఏడాదిగా ఊర్లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదంటే గ్రామస్థులందరూ సమిష్టిగా కృషి చేయడం వల్లనే సాధ్యమయింది. గతేడాది ఏప్రిల్‌లోనే గ్రామస్థులందరం ఏకమై తీర్మానం చేసుకున్నాం. ఎవరూ ఊరు విడిచిపోవద్దని, ఇతరులను రానివ్వవద్దని, గ్రామంలో వీలైనంత వరకు శుభకార్యాలు ఆపేయాలని, అశుభకార్యాలను తక్కువ మందితో చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. చుట్టాలు, స్నేహితులను పిలుచుకుంటే ఇబ్బందయితదని అనుకున్నం. ఎవరన్న కొత్తవారువస్తే రాత్రిపూట ఆతిథ్యం కూడా ఇవ్వడం లేదు. ఈ ఏడాది కూడా అలాగే చేస్తున్నాం.
-తునికి నర్సయ్య, సర్పంచ్‌

ప్రతి ఇంటిపై దృష్టి పెట్టాం

గ్రామం చిన్నదే కావడం, అందరూ తెలిసినవారే ఉండటంతో ఫోన్‌ నంబర్లన్నీ నోట్‌ చేసుకున్నాం. ప్రతిరోజూ గ్రామంలో తిరుగుతూ పరిస్థితులను పరిశీలిస్తున్నాం. గ్రామంలో జనాభా 800 మంది వరకు ఉన్నారు. అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జ్వరసర్వేలో ఒక వ్యక్తికి స్వల్ప లక్షణాలు కన్పించగా.. వెంటనే మండల కేంద్రానికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించాం. నెగెటివ్‌ వచ్చింది. అతడికి ముందస్తుగా మందుల కిట్‌ అందజేశాం.
-అంజలి, ఆశా కార్యకర్త

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం

గ్రామంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గతేడాదే ప్రజల్లో అవగాహన వచ్చింది. పంచాయతీ తరఫున అందరికీ మాస్కులు అందజేశాం. వారానికి రెండుసార్లు గ్రామంలో హైపోక్లోరైట్‌తో స్ప్రే చేయిస్తున్నాం. గ్రామానికి ఒక్కమార్గం మాత్రమే ఉండటంతో ఎవరెవరు వస్తున్నారు, వెళుతున్నారు అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. వెంటనే ప్రజలు అప్రమత్తమవుతున్నారు. గ్రామంలో ఇండ్ల మధ్య దూరం ఉండటం కూడా కలిసివస్తున్నది. ప్రజలు, పాలకవర్గం కృషితో ఇబ్బందిలేకుండా ఉన్నది.
-రౌతు మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి

నిబంధనలను పాటిస్తూనే ఉపాధి

కరోనా నిబంధనలను పాటించడంతోపాటు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధి హామీ పనులకు వెళుతున్నాం. ఇతర గ్రామాలకు చెందినవారిని పనుల వద్దకు రానివ్వడం లేదు. శానిటైజర్‌, మాస్క్‌లు వాడుతున్నాం. రోజుకు 160 నుంచి 180 మంది వరకు కూలీలు పనులకు వస్తున్నా.. ఎలాంటి భయం లేకుండా నిశ్చింతంగా చేసుకుంటున్నాం.
-బొజ్జ జలంధర్‌, ఈజీఎస్‌ మేట్‌

యువతలో చైతన్యం పనిచేసింది

గ్రామంలో యువత ముందు నుంచి చైతన్యవంతంగా పనిచేసింది. కరోనాపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించింది. పక్కాగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇప్పటికీ నిరంతరం పర్యవేక్షిస్త్తూనే ఉన్నది. అవసరం ఉన్నా, లేకున్నా మండల కేంద్రానికి, ఇతర గ్రామాలకు వెళ్లడం లేదు. అందకే ఒక్క కేసు నమోదు కాలేదు.
గుడిపెల్లి మహేశ్‌, గ్రామ యువకుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కన్నెత్తని ఊరు!

ట్రెండింగ్‌

Advertisement