హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ నియామకాల్లో సమగ్రశిక్ష, కేజీబీవీ టీచర్లకు వెయిటేజీ ఇవ్వాలన్న ఆలోచనను విరమించుకోవాలని డీఎడ్, బీఎడ్ నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇది అనాలోచిత నిర్ణయమని, ఇలా వెయిటేజీ ఇవ్వడం నేషషల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధమని ఆ సంఘాలు పేర్కొంటున్నాయి. సమగ్రశిక్ష, కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి డీఎస్సీలో 10 మార్కుల వెయిటేజీ అమలు చేయాలని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని డీఎడ్, బీఎడ్ నిరుద్యోగ సంఘం నేతలు హరీశ్, వీరబాబు, మహేశ్ డిమాండ్ చేశారు. ఇలా వెయిటేజీ ఇస్తూ పోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యావలంటీర్లు, ప్రీప్రైమరీ టీచర్లు కూడా వెయిటేజీ కావాలంటారని తెలిపారు. వెయిటేజీ అమలుచేస్తే బీఈడీ అభ్యర్థుల పాలిట శాపంగా మారుతుందని బీఈడీ అభ్యర్థుల సంఘం నాయకురాలు అయిలి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వెయిటేజీని విరమించుకోకపోతే ఉద్యమానికి సిద్ధమని ఆమె ప్రకటించారు.
25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి ; బీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనితోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీచేయాలని, డీఎస్సీలో కేజీబీవీ టీచర్లకు 10% వెయిటేజీని విరమించుకోవాలని, మాడల్ స్కూల్, గురుకుల టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్ల సాధన కోసం ఆదివారం నుంచి గురువారం వరకు భిక్షాటన, మహాపాదయాత్ర నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్షుడు భూక్యా కుమార్, ఉపాధ్యక్షుడు కోటిగిరి కిరణ్కుమార్ ప్రకటించారు. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ వరకు జరిగే భిక్షాటన, మహాపాదయాత్రలో బీఈడీ అభ్యర్థులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.