Rohini Acharya : ఆర్జేడీ అధినేత (RJD chief) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya).. తన కుటుంబసభ్యులపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తమ వారసత్వాన్ని కొందరు నాశనం చేస్తున్నారని, అందుకు బయట వ్యక్తులు అవసరం లేదని అన్నారు. కుటుంబ గౌరవాన్ని, ఉనికిని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆమె.. ఇది తననెంతో షాక్‌కు గురిచేసిందన్నారు.
‘‘ఎంతో కృషితో సృష్టించిన గొప్ప వారసత్వాన్ని బయటి వ్యక్తులు నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఇందుకు మా ప్రియమైన వాళ్లే చాలు. ముఖ్యంగా మా సొంత వ్యక్తులు సరిపోతారు’’ అని రోహిణి ఆచార్య (Rohini Acharya) పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆమె.. ఎవ్వరి పేరు మాత్రం ప్రస్తావించలేదు. అజ్ఞానం అనే ముసుగు ఉన్నప్పుడు.. అహంకారం తలకెక్కుతుందన్నారు. అప్పుడు వినాశక శక్తులు అప్రమత్తమై ఓ వ్యక్తి ఆలోచన, నిర్ణయాలను నియంత్రిస్తాయని వ్యాఖ్యానించారు.
లాలూ తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కుటుంబం నుంచి బహిష్కరించడంపై రోహిణి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతోపాటు కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా తేజస్వీ యాదవ్ పేరును, ఆయన సన్నిహితుల పేర్లను, పార్టీ కీలక నేతల పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు.