Runa Mafi | మాఫీ మాయాజాలం.. లక్షలోపు రుణమున్నా కనిపించని పేర్లు
అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణం ఏంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
- సర్కారు చెప్తున్న లెక్కల్లో గందరగోళం
- అస్పష్ట జాబితాతో రైతుల్లో ఆందోళన.. అర్హుల జాబితా విడుదలలో గోప్యత
- లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన.. రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం
- ప్యాక్స్ రైతులకు రెండ్రోరోజుల్లో మాఫీ..‘అడంగల్’ అన్నదాతల ఆశలు ఆవిరి
- కొత్తగూడెం సహకార సంఘంలో 720 మంది అన్నదాతలకు రుణమాఫీ నిల్
Runa Mafi | హైదరాబాద్, జులై 18(నమస్తే తెలంగాణ): అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణం ఏంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. రూ. 2 లక్షల రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం గురువారం రూ. లక్ష వరకు గల రుణాలను మాఫీ చేసింది. అయితే పూర్తి వివరాలతో ప్రభుత్వం జాబితా ఇవ్వకపోవడం, గోప్యత పాటించడంతో రైతుల్లో గందరగోళం నెలకొన్నది. దీనికి తోడు రుణమాఫీ పొందిన రైతుల జాబితాను చాలా చోట్ల ప్రదర్శించలేదు.
రైతులకు సమాచారం కూడా అందించలేదు. దీంతో రైతులు జాబితాలో తమ పేరు ఉందో లేదోనని ఆరా తీస్తున్నారు. తమకు రూ. లక్షలోపే రుణం ఉన్నదని, అయినా జాబితాలో తమ పేరు ఎందుకు లేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరో దఫాలోనైనా తమ రుణం మాఫీ అవుతుందా? అని ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాపై గ్రామాల్లో గందరగోళం నెలకొన్నది. జాబితాలు అస్పష్టంగా ఉండడంతో రైతులు ఇబ్బందిపడ్డారు.
కొన్ని గ్రామాలకు బుధవారం రాత్రి జాబితా అందించగా, మరికొన్ని గ్రామాల్లో అయితే గురువారం మధ్యాహ్నం వరకు కూడా జాబితాను విడుదల చేస్తూనే ఉన్నారు. రుణమాఫీ జాబితా విడుదలలో ప్రభుత్వం ఎందుకో కొంత గోప్యత పాటించినట్టు తెలిసింది. అరకొర సమాచారంతో ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాస్తవానికి ప్రభుత్వం ఫలానా జిల్లాలో గానీ, మండలంలో గానీ మొత్తం ఎంతమంది రుణాలు తీసుకున్నారు? ఒక్కొక్కరు ఎంత మొత్తం తీసుకున్నారు? ఎంతమందికి మాఫీ అయింది? ఎంత మొత్తం మాఫీ అయింది? అనే వివరాలతో జాబితా ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రుణమాఫీ అయిన రైతుల జాబితాను మాత్రమే విడుదల చేసింది. దీంతో జాబితాలో పేరు లేని రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక బ్యాంకు నుంచి రూ. లక్షలోపు రుణాలు గల వెయ్యిమంది రైతుల జాబితాను పంపిస్తే, 200 మంది రైతులతో జాబితా తిరిగి వెనక్కి రావడం గమనార్హం.
బ్యాంకర్ల వద్ద కూడా లేని సమాచారం
రుణమాఫీలో నెలకొన్న పలు సందేహాలు, సమస్యలకు బ్యాంకర్లు, అధికారుల వద్ద కూడా సమాచారం కరువైంది. లక్ష లోపు రుణం ఉన్నప్పటికీ తమ పేరు జాబితాలో ఎందుకు లేదంటూ ప్రశ్నించిన రైతులకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా మారింది. తమకు ఇప్పుడు ఎలాంటి వివరాలు తెలియవని, రెండు రోజులు ఆగితే అన్ని వివరాలు చెప్తామని దాటేస్తున్నారు. గతంలో ఒక రైతుకు రుణమాఫీ కాకపోతే ఏ కారణంతో కాలేదో తెలుసుకునే వెసులుబాటు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేదని బ్యాంకర్లు తెలిపారు.
ప్యాక్స్ రైతులకు మరో రెండు రోజులు
ఇతర బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతుండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)లో జమ కాకపోవడంపై ఆ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్యాక్స్ అధికారులను సంప్రదించగా ప్యాక్స్‌లోని రైతులకు రుణమాఫీ కావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్యాక్స్లకు సంబంధించి రుణ మొత్తం సహకార బ్యాంక్ టెస్కాబ్ నుంచి డీసీసీబీల్లోని ప్యాక్స్ అకౌంట్లో జమవుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం రుణమాఫీ మొత్తాన్ని టెస్కాబ్‌కు పంపించగా ఆ మొత్తం క్రమంగా డీసీసీబీలకు చేరుతున్నది. ఆ తర్వాత ప్యాక్స్‌లలో రైతులవారీగా వివరాలు తీసుకొని ఎవరికి ఎంత మాఫీ అయిందో తేల్చిన తర్వాత రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయనున్నారు. కాబట్టి ప్యాక్స్‌లలో రుణం ఉన్న రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
రేషన్‌కార్డు నిబంధనతో అన్యాయం
రేషన్ కార్డు నిబంధనతో చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఒకరు రూ.60వేలు, మరొకరు రూ.70వేలు, మరొకరు రూ.90 వేల వరకు రుణాలు తీసుకున్నారు. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబం యూనిట్‌గా రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తుండడంతో ఈ కుటుంబానికి తొలి విడతలో రుణమాఫీ కాలేదు. మాఫీ కావాలంటే రూ.20వేలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
అందరికీ కాదు.. కొందరికే
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 7,383 మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుండగా తొలి విడతలో 2,667 రైతు కుటుంబాలకు మాత్రం రుణమాఫీ పథకం వర్తించింది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని 23 గ్రామాల్లో 1993 మందికి రుణమాఫీ చేశారు. మండలంలోని గ్రామాల్లో 10, 12, 22, 41 ఇలా దాదాపు 19 గ్రామాల్లో వంద కంటే తక్కువ మందికి రుణమాఫీ చేశారు. సగటున ఒక్కో గ్రామాల్లో 20 శాతం నుంచి 30శాతం మందికే రుణమాఫీ వర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,53,168 మంది రైతులు ఉన్నారు. వీరిలో సిద్దిపేట జిల్లాలో 53,137 మంది, మెదక్ జిల్లాలో 48,864 మంది, సంగారెడ్డి జిల్లాలో 51,167 మందికి మాత్రమే పంట రుణాలు మాఫీ అయ్యాయి. హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 54,739 మంది రైతులు ఉండగా, 10,359 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ దక్కింది. దుబ్బాక మండలంలో 4,694 మంది, మిరుదొడ్డి మండలంలో 3,521 మంది, తొగుట మండలంలో 1,970 మంది, దౌల్తాబాద్ మండలంలో 2,961 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లాలో 1,67,771 మంది, మెదక్ జిల్లాలో 1,53,883 మంది, సంగారెడ్డి జిల్లాలో 1,90.002 మంది రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పంట రుణమాఫీ అయ్యాయి.
కరీంనగర్ ప్యాక్స్ పరిధిలో ఒక్కరికీ కాలే
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక సహకార కేంద్రం పరిధిలో ఎనిమిది గ్రామాలుండగా మొత్తం 1,016 మంది రైతులు రుణం తీసుకున్నారు. అందులో లక్ష వరకు రుణం తీసుకున్న రైతుల సంఖ్య 799 మంది కాగా, వీరు తీసుకున్న రుణం రూ.4.93 కోట్లు. లక్షపైన అప్పు తీసుకున్న రైతులు 217 మంది కాగా, వీరు తీసుకున్నది రూ. 3.90 కోట్ల పైనే. ఈ సొసైటీ పరిధిలో ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఎదిర గ్రామంలో 1,365 మంది రైతులు లక్షలు రుణాలు తీసుకుంటే వారిలో కేవలం 653 మందికి మాత్రమే రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో 30% మందికే
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 39,380 మంది రైతులకు సంబంధించి రూ.211 కోట్లు విడుదలైనట్టు కలెక్టర్ విజయేందిరబోయి ప్రకటించారు. రూ.లక్ష రుణాలు తీసుకున్న వారంతా సుమారు ఒక లక్ష మందికిపైనే ఉంటారని అంచనా. అయితే, వీరిలో కేవలం 30 శాతం మందికి మాత్రమే రుణమాఫీ వర్తింపజేశారు. వనపర్తి జిల్లాలో 28,408 మంది ఉండగా రూ.156.91 కోట్లు మాఫీ అయింది. గద్వాల జిల్లాలో 1.40 లక్షల మంది రైతులకుగానూ 24,398 మంది రైతులకు రూ. 144 కోట్లు విడుదలయ్యాయి. నారాయణపేట జిల్లాలో 28,684 మందికిగానూ రూ.165,45 కోట్లు మాఫీ అయింది. నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి లెక్కల ప్రకారం 83 వేల మందికి రూ.453 కోట్ల లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. గొల్లగూడ కోఆపరేటివ్ సొసైటీలో మొత్తం 1274 మంది రైతులు రెండు లక్షల వరకు రుణాలు తీసుకోగా, వారిలో లక్ష రుణాలు పొందిన 500 మందికి మాఫీ అయింది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ సహకార సొసైటీలో 117 మంది లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు ఉన్నారు. వీరిలో ఎంత మందికి రుణమాఫీ వర్తించిందనేదానిపై సాయంత్రానికి కూడా స్పష్టత లేకుండా పోయింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎల్ఏసీఎస్ పరిధిలో 777 మంది లక్ష రూపాయల్లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. 555 మందికి రుణమాఫీ అయింది.
కేసీఆర్ మాఫీ చేసిండు.. ఇప్పుడు కాలే!
కేసీఆర్ సర్కారున్న కాలంలో చెప్పినట్టు రైతులందరికీ రుణమాఫీ చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికే ఇచ్చి మిగిలినోళ్లకు ఇయ్యకుంటే మంచిగుండదు. మా బాధలను రేవంత్ సార్ అర్థం చేసుకోవాలి. రైతులందరికీ రుణమాఫీ చెయ్యాలె. నేనైతే పంటలేసేందుకు 45 వేలు అప్పు తెచ్చిన. రూ.లక్షలోపు లోన్ మాఫీ చేస్తమని చెప్పిండ్రు. కానీ లిస్టుల నా పేరు లేదు. ఏం.. నేను రైతును కాదా?
– రాములు, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా
కాంగ్రెస్ నేతను.. మాకే రాలే!
మా అమ్మ జాల లక్ష్మి పేరిట 50 వేలు పాత భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని కెనరా బ్యాంకులో క్రాప్‌లోన్ తీసుకున్నం. కానీ, మా కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన రూ.లక్ష లోపు మాఫీ రుణాలల్ల మా అమ్మ పేరు లేదు. చాలా బాధ అనిపించింది. గ్రామస్థాయిలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న నాకే ఇట్ల జరిగితే ఎట్లా? ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నాది. మా ఇంట్లోనే రుణమాఫీ జరగలేదు.. నేను బయటకుపొయ్యి ఏం మాట్లాడుత? సెకండ్ లిస్ట్‌లోనైనా మా అమ్మ పేరు వస్తుందో లేదో!
-జాల రవి, కాంగ్రెస్ నాయకుడు, కట్కూరు, అక్కన్నపేట మండలం (సిద్దిపేట జిల్లా)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

