మారేడ్‌పల్లి, జూలై 18: కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌పై ఆగస్టు 10న పార్లమెంటు ముందు మహా నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య తెలిపారు. ఈ నిరసనలో రైల్వే కార్మికులతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన డిఫెన్స్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ చిలకలగూడ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రైల్వేబోర్డు, రైల్వేశాఖ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో భారత రైల్వేను మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తున్నదని ఆరోపించారు. రైల్వేలోని వివిధ విభాగాల్లో ఉన్న వేలాది ఖాళీల పోస్టులను భర్తీ చేయకపోవడంతో రైల్వే కార్మికులపై అదనపు పని భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్తగా 19 వేల కిలోమీటర్ల రైల్వేలైన్, కొత్త కోచ్ ఫ్యాక్టరీల నిర్మాణం జరిగినప్పటికీ ఆ మేరకు కార్మికుల పోస్టులను భర్తీ చేయలేదని చెప్పారు. ఇప్పటికైనా రైల్వేభద్రత, నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి నియామకాలపై బ్యాన్‌ను ఎత్తి వేసి ఉద్యోగులు, సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రు, సహాయ ప్రధాన కార్యదర్శులు భరణి భానుప్రసాద్, నారాయణరావు, డివిజన్ సెక్రటరీ కేవీఆర్ ప్రసాద్, భుజంగరావు, ప్రభాకర్, ఆమంచి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.