హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వృత్తివిద్యా కళాశాలల్లో ట్యూషన్ ఫీజుల సవరణకు అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) రంగం సిద్ధం చేసింది. 2022-23, 2023-24, 2024-25 సంవత్సరాలకు ఈ సారి ఫీజులను నిర్ణయించనున్నారు. ఇంజినీరింగ్, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, డీఈఈ వంటి కోర్సులకు ఈసారి గరిష్ఠంగా 25 శాతంవరకు పెరిగే అవకాశమున్నదని సమాచారం. 10 శాతం ఫీజులు ద్రవ్యోల్బనం ప్రకారం, మరో 15 శాతం కాలేజీల అభివృద్ధికి సంబంధించి మొత్తం గరిష్ఠంగా 25 శాతం పెరిగే అవకాశాలున్నాయని ఏఎఫ్ఆర్సీ అధికారులు వెల్లడించారు. ఫీజుల సవరణ ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఫీజుల సవరణపై కాలేజీల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
కరోనా కారణంగా 2019-20, 2020-21 సంవత్సరాలకు లెక్కించాల్సిన ఆదాయం, ఖర్చులను కేవలం 2019-20 ఏడాదికే లెక్కించబోతున్నా రు. ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ట్యూషన్ ఫీజు రూ.35 వేలు ఉన్న ది. బోధన, బోధనేతర సౌకర్యాలు ఉత్తమంగా ఉన్న కాలేజీల్లో రూ.లక్షకుపైగానే ఫీజులున్నాయి. తాజా సవరణ ప్రకారం కొన్నికాలేజీల్లో ఫీజులు 25 శాతం పెరిగే అవకాశం ఉన్నది. ప్రమాణాలు సరిగాలేని కాలేజీల్లో ఫీజులు మారకపోవచ్చు. మెడికల్ కాలేజీల్లో ఫీజుల సవరణపై వచ్చే విద్యాసంవత్సరంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఫీజులు ఖరారు చేయడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీనిపై ఎన్ఐసీతో టీఏఎఫ్ఆర్సీ అధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. 2019-20 విద్యా సంవత్సరానికి కాలేజీల ఆదాయ వ్యయ వివరాలు, ఆడిట్ నివేదికలను కూడా ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు.