హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త పోస్టుల మంజూరు అటకెక్కింది. 113 పోస్టులను మంజూరుచేయడంపై సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. ఫలితంగా అత్యంత కీలమైన డీఈవో, డిప్యూటీ ఈవో పోస్టులను ఇన్చార్జిలతో నెట్టుకు రావాల్సి వస్తున్నది. పాఠశాల విద్యాశాఖలో కొంతకాలంగా పర్యవేక్షణ పూర్తిగా గాడితప్పింది.
కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ 113 కొత్త పోస్టులను మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఫిబ్రవరిలోనే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినా సర్కారు ఇంతవరకు ఒక్క పోస్టునూ మంజూరు చేయలేదు. 21 డీఈవో, 28 డిప్యూటీ ఈవో, 59 ఎంఈవో, 5 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను మంజూరుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఏడాదికి రూ.19.99 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేసింది. ఏడు మాసాలు గడిచినా ఈ ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి.