దసరాకైనా కొత్త పింఛన్ వచ్చేనా?
రాష్ట్రంలో కొత్త ‘ఆసరా’ పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రహసనంలా సాగుతున్నది.
- సాకులతో సాగదీస్తున్న సర్కార్
- ఇప్పటికే వాయిదాలపై వాయిదాలు
- దసరాకు ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటన
- స్క్రూటినీలో జాప్యంతో మళ్లీ అనుమానమే
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త ‘ఆసరా’ పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రహసనంలా సాగుతున్నది. రేపు మాపు అంటూ సాకులు చెప్తూ గడువు పొడిగిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. గత మూడు నెలల్లో మూడుసార్లు ఈ పింఛన్ల మంజూరును వాయిదావేసింది. తాజాగా దసరా పండుగ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పంచాయ తీరాజ్, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మూడు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. దీంతో దసరాకు కూడా కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
మూడేండ్ల తర్వాత కదిలిన ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ‘ఆసరా’ పింఛన్‌ను రెట్టింపు చేయడంతోపాటు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తామని 6 గ్యారెంటీల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన వెంటనే 2024 జనవరిలో హడావుడి చేసింది. ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సాకులు చెప్తూ కాలం వెళ్లదీసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పంద్రాగస్టు కానుకగా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం స్వయంగా ప్రకటించారు.
దీంతో ప్రజాపాలన గ్రామసభల్లో తీసుకున్న అప్లికేషన్లను పక్కనబెట్టి మరోసారి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు తెరలేపారు. అర్హులైనవారు ఆగస్టు 9లోగా దరఖాస్తు చేసుకోవాలని సెర్ప్ సీఈవో సూచించారు. అనంతరం ప్రభుత్వ సిబ్బంది ‘సర్’ ప్రక్రియలో నిమగ్నమయ్యారన్న సాకుతో దరఖాస్తు తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఆ తర్వాత అర్హుల విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ దాఖలుకు అవకాశమిస్తున్నట్టు తెలిపారు. తదనంతరం వినాయకచవితి పండుగ విధుల్లో పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు నిమగ్నమయ్యారని, అప్లికేషన్ల స్క్రూటినీ పూర్తికాలేదనే సాకుతో దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
నత్తనడకన దరఖాస్తుల పరిశీలన
కొత్త పింఛన్ల మంజూరులో వృద్ధులు, బీడీ కార్మికులు, టేకేదార్లను ప్రభుత్వం విస్మరించింది. కేవలం ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఫైలేరియా/డయాలసిస్ బాధితులకే అవకాశం కల్పించింది. దీంతో సెప్టెంబర్ 30 నాటికి 5,98,193 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3.31 లక్షల మంది వితంతువులు, 60 వేల మంది ఒంటరి మహిళలు, 50 వేల మంది దివ్యాంగులతోపాటు 1.60 లక్షల మంది ఇతరులు ఉన్నారు.
ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసి 12 రోజులు కావస్తున్నప్పటికీ వాటి పరిశీలన పూర్తికాలేదని, ఇంకా 40 శాతానికిపైగా దరఖాస్తులను స్క్రూటినీ చేయాల్సి ఉన్నదని తెలుస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారుల ఎంపికకు మరింత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. దీంతో దసరా నాటికి కూడా కొత్త పింఛన్లు మంజూరు కావని స్పష్టమవుతున్నది.
దరఖాస్తుదారుల ఆగ్రహం
కొత్త పింఛన్ల మంజూరును ప్రహసనంలా మార్చిన కాంగ్రెస్ సర్కార్‌పై దరఖాస్తుదారులు ధ్వజమెత్తుతున్నారు. దరఖాస్తులు తీసుకొని రెండు నెలలు దాటినా స్పష్టత లేకపోవడంపై మండిపడుతున్నారు. పింఛన్ల కోసం దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న తమ ఆశలపై రేవంత్‌రెడ్డి సర్కార్ నీళ్లు చల్లుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈసారి దసరా నాటికైనా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని వికలాంగుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. లేకుంటే పండుగ తర్వాత తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

