Medigadda Barrage | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు, తీసుకోవాల్సిన నివారణ చర్యల కోసం సిఫారసు చేసేందుకు ఏర్పాటైన ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) తుది నివేదికను ఇవ్వడంలో కాలయాపన చేస్తున్నది. ప్రాజెక్టు పునురద్ధరణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతున్నది. దీంతో ఏడాదిన్నర గడిచినా పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి సారించడమే లేదు. తుది నివేదిక ఎప్పుడు వచ్చేది తెలియని పరిస్థితి నెలకొన్నది. బరాజ్ ఘటన జరిగిన వెంటనే ఆగమేఘాలపై వచ్చి కేవలం రెండు రోజుల్లోనే ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా మధ్యంతర నివేదికన ఇచ్చిన ఎన్డీఎస్ఏ బృందం.. తుది నివేదికను మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. అదిగో, ఇదిగో అంటూ గడువును మీరుతున్నది తప్ప నివేదికను మాత్రం ఇవ్వడం లేదు. వాస్తవంగా నివేదికను గత ఫిబ్రవరిలోనే కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించిందని తెలుస్తున్నది. రాష్ర్టానికి మాత్రం ఇప్పటికీ పంపించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఈ నెల 30న ఎన్డీఎస్ఏ చైర్మన్ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారైనా బరాజ్‌కు సంబంధించిన తుది నివేదికను ఇస్తారా? అనే చర్చ సాగుతున్నది. ప్రభుత్వమైనా చొరవ చూపి తుది నివేదిక ఇవ్వాలంటూ నిలదీయాలని రాష్ట్ర సాగునీటిరంగ నిపుణులు కోరుతున్నారు.
మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ కుంగుబాటు, అన్నారం (పార్వతీ), సుందిళ్ల (సరస్వతీ) బరాజ్‌ల్లో సీపేజీలపై సాంకేతిక అధ్యయనం చేసి, తదుపరి చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులను, తీసుకోవాల్సిన నివారణ చర్యలను సిఫారసు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిరుడు మార్చిలో ఎన్డీఎస్ఏ ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. 4 నెలల్లో నివేదికను అందజేయాలని ఆనాడే ఆదేశించింది. అదే ఏడాది మార్చి 6,7,8,9 తేదీల్లో, ఆ తర్వాత 20,21,22 తేదీల్లో కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. స్వయంగా వెళ్లి 3వ బరాజ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నిర్మాణ ఏజెన్సీలతో, అందులో భాగస్వాములైన అధికారులతోనూ బృందం భేటీ అయి వివరాలను సేకరించింది. అనంతరం మధ్యంతర మార్గదర్శకాలను జారీచేసింది.
సాంకేతిక సమాచారం, పరీక్షల రిపోర్టులను పరిశీలించి తుది నివేదికను గతేడాది డిసెంబర్‌లోగానే సమర్పిస్తామని వెల్లడించింది. అయినా అందుబాటులో ఉన్న అరకొర సమాచారంతోనే అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ మేడిగడ్డ తుది నివేదికను ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు గత ఫిబ్రవరిలో అందజేసినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఆ నివేదికను సీడబ్ల్యూసీ పరిశీలనకు కేంద్ర జలశక్తి శాఖ పంపినట్టు తెలుస్తున్నది. దాదాపు రెండు నెలలు గడిచినా ఇప్పటికీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు మాత్రం తుది నివేదికను పంపలేదు. మేడిగడ్డ బ్యారేజీ తుది నివేదికను తెప్పించుకోవడంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని సాగునీటిరంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా మేడిగడ్డ బరాజ్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టాలని అధికారులు సైతం చెప్తున్నారు.