హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): 17 కోట్ల ప్రజల డాటాను అక్రమంగా చేజిక్కించుకుని సైబర్నేరాలను ప్రోత్సహిస్తున్న నోయిడా ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏ రాష్ట్ర పోలీసు లు చేయని దర్యాప్తు మన పోలీసులు చేసి, డాటా చోరీ వ్యవహారంలో మొత్తం 12 మందిని అరెస్టు చేయడంపై నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నా యి. ఈ అంశం శనివారం ట్విట్టర్లో ట్రెండింగ్ అయ్యింది. 3, 6, 9వ స్థానాల్లో మనోళ్లు నిలిచారు. దీంతో ప్రతి ఒక్కరూ మన పోలీసుల ఇన్వెస్టిగేషన్ గురించి ట్వీట్ చేశారు. డాటా చోరీ ఎంత ప్రమాదకరమో? దీనిని అరికట్టేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం డాటా ప్రైవసీ బిల్లును అందుబాటులోకి తీసుకురావాలని నెటిజన్లు కోరారు.