హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో సమర్థత, పారదర్శకతతోపాటు విశ్వసనీయతను పెంపొందించడంలో ‘సాంకేతిక పరివర్తన పాత్ర’ అనే అంశంపై కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈనెల 22న ప్రారంభమైన రెండ్రోజుల జాతీయ వర్క్‌షాపు ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి జాతీయస్థాయిలో 19 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి చైర్మన్లు, సభ్యులతో కలిపి మొత్తం 60మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ వర్క్‌షాపులో టీజీపీఎస్సీ నుంచి చైర్మన్ బుర్రా వెంకటేశంతోపాటు సభ్యులు ప్రొఫెసర్ యాదయ్య, పీ రజనీకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశం మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, సమర్థవంతమైన విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ప్రాధాన్యత గురించి వివరించారు.