బీఆర్ఎస్కు ఓటేస్తేనే భవిష్యత్తు
‘రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నది.
- కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే
- జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహం
- తెలంగాణ ఆకాంక్షను దెబ్బతీసిన కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర
- బహుజనవాదం, తెలంగాణవాదం కలవాలి ఈ రెండూ కృష్ణా-తుంగభద్రల్లాంటివి
- ప్రాంతీయ పార్టీలకే రాష్ర్టాలపై ధ్యాస
- కందనూలును నైపుణ్య రాజధాని చేస్తా
- నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నాగర్‌కర్నూల్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నది. ఇదే జరిగితే దేశంలో మతకల్లోలాలు చెలరేగుతాయి. తెలంగాణ ఆకాంక్షను కాంగ్రెస్ దెబ్బతీసింది. రాష్ర్టానికి ఏమీ చేయని కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అంటున్నారు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. తన లక్ష్యమైన బహుజనవాదం, కేసీఆర్ లక్ష్యమైన తెలంగాణవాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే బీఆర్ఎస్ లో చేరినట్టు చెబుతున్న ఆర్ఎస్పీతో ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక ఇంటర్వ్యూ….
ఎంపీగా పోటీ చేస్తానని అనుకున్నారా?
ఏ మాత్రం అనుకోలేదు. కొంత యాదృచ్ఛికంగానే జరిగింది. బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు ద్వారా ముందుకు పోదామనుకున్నాం. కానీ బీజేపీ కుట్రలతో అది భగ్నమైంది. కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బహుజనవాదం, తెలంగాణవాదం కలవాల్సి ఉన్నది. ఈ రెండూ కృష్ణా-తుంగభద్రల్లాంటివి. కేసీఆర్‌కు ఇచ్చిన మాట, ఆలోచన మేరకు నేను బీఆర్ఎస్లో చేరా. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా అన్న ఆలోచన ఆరు నెలల ముందు వరకు లేకుండె. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తానని నమ్ముతున్నా.
ప్రచారంలో ఎలాంటి స్పందన వచ్చింది?
ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. స్వచ్ఛందంగా నా గెలుపు కోసం పని చేరు.
మీరు గుర్తించిన సమస్యలేంటి?
ప్రధానంగా వలస సమస్య ఉన్నది. కేసీఆర్ రాకముందు వేరే రాష్ర్టాలకు వలసవెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్, ఇతర పట్టణాలకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను ఈ సమస్య వేధిస్తున్నది. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేకపోవడం, నైపుణ్యాలు లేకపోవడం ప్రధాన సమస్య. కేసీఆర్ వచ్చాక సాగునీటి సమస్య తీరింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేకపోవడం సమస్య.
ఢిల్లీ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలుఉన్నాయా?
ఢిల్లీలో కేంద్ర, రాష్ర్టాలకు సంబంధించి 2,100 పథకాలు ఉంటాయి. వీటితో పార్లమెంట్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేయవచ్చు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, పైలట్ ప్రాజెక్టుగా నాగర్‌కర్నూల్‌ను ఎంపిక చేసేలా కేంద్రా న్ని ఒప్పిస్తా, అవసరమైతే పోరాడుతా. నాగర్‌కర్నూల్‌కు పెద్దమొత్తంలో నిధులు తీసుకొస్తా. ఢిల్లీలో వేల కోట్ల నిధులుంటాయి. వాడుకోవాలన్న స్పష్టత, చైతన్యం ఉండదు. నేను ఐపీఎస్ సర్వీసులో ఉన్నా కాబట్టి అధికారుల సహకారంతో ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం, మోసం, దోపిడీ, గ్యారెంటీల పేరుతో చేస్తున్న గారడీ విధానాలను ఎండగట్టడం చాలా ముఖ్యం. ప్రజల గొంతుకగా చట్టసభల్లో మాట్లాడాల్సి ఉన్నది.
జాతీయ పార్టీలతోనే అభివృద్ధి అనే మాటపై మీ అభిప్రాయం..?
ఇది చాలా మంచి ప్రశ్న. జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహమే జరిగింది. చాలా రాష్ర్టాలు ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి చెందాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి అయ్యాయి. ప్రాంతాలను దోచుకోవడం, పార్టీని నడుపుకోవడం కోసమే మనల్ని జాతీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి.
అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వవు. కాంగ్రెస్ పాలనలో రాష్ర్టానికి ఘోరమైన అన్యాయం జరిగింది. తెలంగాణ కలను కాంగ్రెస్ భగ్నంచేసింది. శ్రీభాగ్ ఒడంబడిక, పెద్దల ఒప్పందం పేరుతో తెలంగాణ ప్రజల మెడలు వంచింది. చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నాశనం చేసింది. మోదీ కూడా తెలంగాణకు చేసింది జీరో. ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంపైనే ధ్యాస ఉంటది. కాళేశ్వరం, మిషన్‌కాకతీయ,మిషన్‌భగీరథ, గురుకులాలు, ఐటీ కారిడార్, హైదరాబాద్ అభివృద్ధి ప్రాంతీ య పార్టీ వల్లే జరిగిందనేని జగమెరిగిన సత్యం. ప్రాంతీయ పార్టీలకు ఓటేస్తేనే మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవచ్చు. సారవంతమైన నేలలో విత్తనం వేసినట్లే అవుతుంది.
వారసత్వ రాజకీయాలపై మీ వైఖరి?
వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యత ఉంటుందనుకోను. ప్రతిభ మీదనే మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. ఎవరు బాగా పని చేస్తరు, ఎవరు బాగా పని చేయరనేది దేశ యువత అంతా చూస్తున్నది. బలవంతంగా ఈయననే మీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అని రుద్దితే ప్రజలు అంగీకరించరు. మల్లు అనంతరాములు ఎంపీ అయినంత మాత్రాన మల్లురవిని, రాములు కొడుకైనంత మాత్రాన భరత్‌ను ఆదరిస్తరనుకోను. సొంత శ్రమతోనే వ్యక్తులు పైకి రావాలి. వారసత్వంతో పైకి వస్తారనే రోజులు పోయాయి.
సివిల్ సర్వెంట్‌గా ఉన్న మీరు ఏం సాధించాలని రాజకీయాల్లోకి వచ్చారు?
ఈ ప్రాంత బిడ్డలను నాకంటే గొప్పగా బాగు చేస్తా. ఉద్యోగాల కోసం కేంద్రంతో కుస్తీ పడుతా. నాగర్‌కర్నూల్ ప్రాంతాన్ని నైపుణ్యాలకు రాజధాని చేస్తా. రాజస్థాన్ ఐఐటీ కోచింగ్ కేంద్రంలాగా నాగర్‌కర్నూల్, వనపర్తిని మార్చేందుకు కృషి చేస్తా. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా చేయవచ్చు. ఆదిమ జాతులను ప్రపంచ పటంలోకి తీసుకెళ్లొచ్చు. బంజారా బిడ్డలకు ఏకలవ్య మోడల్ స్కూల్స్, అగ్రికల్చర్, ఫిషరీస్ కాలేజీలకు అనుబంధంగా పరిశ్రమలు తీసుకొచ్చేందు కు కృషి చేస్తా.
చిరకాల కోరికైన వనపర్తి-డోర్నకల్, అలంపూర్-గద్వాల రైలు, అలంపూర్-కర్నూలు బ్రాడ్‌గేజ్ డబుల్ లైన్, అలంపూర్, గద్వాల, వనపర్తి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం పాటుపడుతా. తెలంగాణ,ఏపీ, కర్ణాటక రాష్ర్టాల కూడలి అయినందున నదులపై వంతెన, నాలుగు వరుసల జాతీయ రహదారి ఏర్పాటు చేయాల్సి ఉన్నది. పారిశ్రామిక కారిడార్, ఏరో స్పేస్, ఐటీ కారిడార్లు ఏర్పాటు చేయొచ్చు. పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, అలంపూర్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అయిజ వంటి ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ తీసుకుంటా.
24 గంటలు కోచింగ్ కేంద్రాలు, చిన్న పిల్లల కోసం బేబీ లెర్నింగ్ కేంద్రాలను ఇటాలియన్, యూరోపియన్ మోడల్లో పెట్టాలనున్నది. స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక రుగ్మతలు, మహిళల మీద కనిపించని అఘాయిత్యాలు తగ్గించడంతోపాటు పేదలకు లీగల్ అసిస్టెంట్ కేంద్రాలు నెలకొల్పాలనున్నది. మనిషి జీవన ప్రమాణాలు 60-65ఏళ్ల నుంచి 70-80సంవత్సరాల పాటు హాస్పిటళ్లకు వెళ్లకుండా కాల్ సెంటర్ పెట్టి దేశంలోనే హ్యాపీనెస్ క్యాపిటల్‌గా చేయాలని అనుకుంటున్నా.
నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై మీ వైఖరి?
యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. రేడియో ధార్మిక పదార్థంతో క్యాన్సర్ వస్తుంది. ఆదిమ జాతుల తరలింపునూ ఒప్పుకోను. అటవీ ప్రాంతాల్లో జీవించడం సొంత హక్కు. రాజ్యాంగం రాకముందు నుంచీ వీళ్లు అడవుల్లో ఉంటున్నారు. తరలించడమనేది పూర్తిగా జీవించే హక్కుకు వ్యతిరేకం. ఆర్టికల్ 21, 19కి వ్యతిరేకం.
మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా?
బీజేపీని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామా అని ప్రజలు చూస్తున్నారు. కేవలం శ్రీరామచంద్రుడు, అక్షింతలతో ఓట్లు దండుకోవాలని ఆ పార్టీ చూస్తున్నది. బీజేపీ లేనప్పుడు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనమంతా హిందువులమే. బీజేపీ రాకముందు నుంచే రామాలయాలు, హిందూ మతం ఉన్నాయి. హనుమాన్ జయంతిని జరుపుకొంటున్నాం. బీజేపీ వచ్చి ఇప్పుడు కొత్తగా చేసిందేమీ లేదు. మతం పేరుతో దేశ ప్రజలను మత్తులో ఉంచి అభివృద్ధికి దూరంగా చీకటిరోజుల్లోకి తీసుకుపోవాలని, మతసామరస్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నది. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నది. రాజ్యాంగం రద్దయితే రిజర్వేషన్లు పోతయ్. దేశం అల్లకల్లోలమైతది. మతకల్లోలాలు చెలరేగుతయ్. దేశ ప్రజల ఆస్తి గుజరాత్ సేట్ల దగ్గరికి పోతుందన్నది వాస్తవం. కర్ణాటకలో మహిళలపై లైంగికదాడికి పాల్పడిన రేవణ్ణను మోదీ వెనకేసుకొస్తున్నరు. అలాంటి దుర్మార్గమైన బీజేపీని ఎలా ఆదరిస్తారు. ముచ్చటగా మూడోసారి కాదుకదా మూడు చెరువుల నీళ్లు తాగించి మూడు మీటర్ల లోతైన బొందలో పెట్టాలని చూస్తున్నారు.
ఈ ఎన్నికల్లో మీకు ప్రత్యర్థి ఎవరు?
నాకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. కాంగ్రెస్‌తో పోటీయే లేదు. బీజేపీ-కాంగ్రెస్ కూటమి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించితేనే దేశం బాగుంటుంది. రాజ్యాంగం రద్దయితే సామాజిక న్యాయం కనుమరుగవుతుంది. వెనకబాటుతనం పెరుగుతుంది. ధనవంతులు మరింత ధనవంతులవుతారు. పేదలు మరింత పేదలవుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

