హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ‘ది హిందూ’ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రెస్ క్లబ్‌ల ప్రతినిధులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘ది ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ను శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ రామ్ మాట్లాడుతూ.. మీడియాపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడం, దాని స్వేచ్ఛ, స్వాతంత్య్రానికి పెరుగుతున్న ముప్పులను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రెస్‌క్లబ్‌లు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రాజకీయాలు-జర్నలిజం విడదీయలేని రంగాలుగా మారాయని, కొన్ని సందర్భాల్లో టెలివిజన్ చర్చల్లో సమాచారానికి బదులు గందరగోళం సృష్టించడంతో ప్రజల్లో మీడియాపై విశ్వాసం దెబ్బతింటున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలతోనే పత్రికా స్వేచ్ఛ మనుగడ సాగించలేదని, ప్రజల విశ్వాసం కూడా అత్యంత కీలకమని తెలిపారు. మీడియా విశ్వసనీయత, వృత్తిపరమైన నైతిక విలువలను ప్రోత్సహించడంలో ప్రెస్‌క్లబ్‌ల పాత్ర కీలకమని సూచించారు. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం, పాత్రికేయులను అరెస్ట్ చేయడం వంటివి ఏ ఒక్కో రాజకీయ పార్టీకో, ప్రభుత్వానికో పరిమితం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 1988లో దేశవ్యాప్తంగా పాత్రికేయులు చేసిన ఐక్యపోరాటం ఫలితంగానే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వివాదాస్పద డిఫమేషన్ బిల్లును ఉపసంహరించుకున్నట్టు ఆయన గుర్తు చేశారు.
దేశంలో ఎక్కడైనా జర్నలిస్టులు బెదిరింపులకు గురైతే తక్షణమే స్పందించే జాతీయ నెట్‌వర్క్‌ను ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ఏర్పాటు చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం, అసత్య వార్తలు వ్యాప్తి చెందడానికి సోషల్‌మీడియా కారణమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ఐకమత్యంగా మెలగడంతోపాటు జర్నలిస్టులను రక్షించడంలో ప్రెస్ క్లబ్, ఎడిటర్స్ గిల్డ్, వర్కింగ్ జర్నలిస్టు యూనియన్లు కలిసి పనిచేయాలని కోరారు.
అధికారంలో ఉన్నవారిని సైతం వదలొద్దని, అదే సమయంలో వృత్తి ప్రమాణాలను విస్మరించవద్దని జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. పాలకపక్షాన్ని జవాబుదారీగా ఉంచాలని, రిపోర్టర్లు జవాబుదారీగా ఉండాలని తెలిపారు. ఈ రెండింటి ప్రయోజనం చివరకు పౌరులకే దక్కాలని ఆయన కాంక్షించారు. కారవాన్ సంపాదకుడు అనంత్నాథ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు సంగీతా బరూవా పిషారోటి మాట్లాడుతూ పాత్రికేయులపై దాడులకు, పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లినప్పుడు జర్నలిస్టు లోకం కలిసి గళం విప్పాల్సిన అసవరం ఉన్నదని అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విజేతలకు జ్ఞాపికలను అందజేశారు.
కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు గౌతమ్లాహిరి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ప్రెసిడెంట్ విజయకుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ఏ రాజేశ్, అరుణ అత్తలూరి, జాయింట్ సెక్రటరీ చిలుకూరి హరిప్రసాద్, వర్ధెల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, కార్యవర్గసభ్యులు ఎన్ శ్రీనివాస్‌రెడ్డి, ఉమాదేవి, ముత్యాల సత్తిబాబు, అమిత్ బట్టు, రచన ముడుంబై, వనం నాగరాజు, మర్యాద రమాదేవి తదితరులు పాల్గొన్నారు.