హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్, కేవీపీ ఫౌండేషన్ అందించే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవార్డు- 2026ను ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్)కు ప్రదా నం చేయనున్నట్టు ఫౌండేషన్ ట్రస్టీలు మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
రూ.25 లక్షల నగదు పురసారంతో కూడిన ఈ అవార్డును సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ తరఫున డాక్టర్ సౌమ్యాస్వామినాథన్ అవార్డు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. భారత వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ చేసిన విశేష కృషికిగాను ఈ అవార్డు అందించనున్నట్టు తెలిపారు. దివంగత ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ రివల్యూషన్‌కు అందించిన చారిత్రక సేవలను కొనసాగిస్తూ ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ రైతులు, గ్రామీణ సమాజాలకు శాస్త్రీయ ప్రయోజనాలను చేరువ చేస్తున్నదని పేర్కొన్నారు. రైతులు, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమానికి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చూపిన నిబద్ధతను కొనసాగించేందుకు ఫౌండేషన్ పనిచేస్తున్నట్టు ట్రస్టీలు వెల్లడించారు.
వ్యవసాయం, సాగునీరు, ఆరోగ్యం, విద్య, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషిచేసిన వ్యక్తులు, సంస్థలను సతరించడం, విద్యార్థులకు సాలర్షిప్లు అందించడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. 2025లో తొలి వైఎస్సార్ అవార్డును సహజ వ్యవసాయంలో విశేష కృషి చేసిన సుభాష్ పాలేకర్‌కు అందించినట్టు గుర్తుచేశారు. 2026 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ వర్సిటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థికి ఏటా సాలర్షిప్ అందించేందుకు రూ.21 లక్షల నిధిని ఫౌండేషన్ ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.