వీర్నపల్లి , జూలై15 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేతకు వెళ్లి 80పైగా ఆవులు మృత్యువాత పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల లోద్ది తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన 20మంది రైతులు తమ ఆవులను సమీపంలోని అటవీ ప్రాంతానికి గురువారం ఉదయం తీసుకెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. గమనించిన రైతులు గ్రామస్థులకు సమాచారం అందించగా.. చీకటి పడడంతో గాలింపు చేపట్టలేదు.
శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతంలో గాలించగా..80 పైగా ఆవులు మృతిచెంది ఉన్నాయి. మరో 50 పైగా ఆవుల అచూకీ లభ్యం కాలేదు. సంఘటనా స్థలాన్ని పశుసంవర్థక శాఖ జేడీ కొంరయ్య, ఎంపీపీ మాలోత్ భూల పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.