Farmers Suicide | దశాబ్దాలుగా సమైక్య పాలకులు సృష్టించిన దుర్భిక్షం బారినపడి వేలాదిమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సాగునీళ్లు లేక, సర్కార్ సాయం అందక తనువు చాలించారు. కానీ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, రైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారింది. సంక్షేమ పథకాలు రైతుకు భరోసానిచ్చాయి. పెట్టుబడిసాయం అప్పులబాధ తీర్చింది. సాగునీళ్లు, కరెంటు, విత్తనాలు, ఎరువులు అన్నీ అడగకుండానే అందాయి. రైతు చిరునవ్వుతో సాగుచేస్తే.. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది. కానీ, ఇప్పుడేమైంది? కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభంగా మారింది. ఆత్మహత్యల పరంపర మళ్లీ మొదలైంది.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): సంక్షేమం బంద్ అయింది, సర్కార్ నుంచి అందే సాయం నిలిచిపోయింది, భూముల ధరలు పతనమయ్యాయి, అమ్మాయిల పెండ్లిం డ్లు, బిడ్డల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. గతంలో మాదిరిగా అప్పులూ పుట్టడంలేదు, అప్పు ఇచ్చినా.. రైతులు తిరిగి చెల్లిస్తారో లేదోననే అపనమ్మకంలో వ్యాపారులు ఉంటున్నారు. పంటనష్ట పరిహారం లేదు. రైతుభరోసా సక్రమంగా రాదు. పంటలు కొనుగోలు చేసే దిక్కులేదు.. వెరసి రైతులు ఆర్థిక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక, మరో గత్యంతరంలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఇలా కాంగ్రె స్ సర్కార్ ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రం రైతు ఆత్మహత్యల రాజ్యంగా మారిపోయింది. రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో అన్నదాతల మృత్యుఘోష మార్మోగుతున్నది. సంక్షేమం ఆగిపోవడంతో ఆదుకొనే దిక్కులేక రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.
30 నెలలు… 70వేల మంది రైతులు మృతి
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతున్నాయనే విమర్శలున్నాయి. మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించే రైతుబీమా పథకం లెక్కలు పరిశీలిస్తే, కండ్ల్లు బైర్లు కమ్మే పరిస్థితి.. రైతుబీమా లెక్కల ప్రకారం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఏకంగా 69,880 మంది రైతులు వివిధ కారణాలతో మరణించినట్టు వ్యవసాయ శాఖ లెక్క తేల్చింది. 2023-24 సంవత్సరంలో 23,932 మంది రైతులు మరణించగా, 2024-25లో 25,861 మంది, 2025-26లో ఇప్పటి వరకు 20,087 మంది రైతులు మరణించారు. 2023-24తో పోల్చితే 2024-25లో 1,929 మంది రైతులు ఎక్కువగా చనిపోవడం గమనార్హం. సామాజిక కార్యకర్తలు చేసిన సర్వే, వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాల ప్రకారం.. 30 నెలల్లో కేవలం అప్పుల బాధతోనే వెయ్యి మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క తేలింది. అదే విధంగా రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన సర్వేలో 625 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్కతేలింది. వీళ్లంతా కేవలం అప్పుల బాధలు భరించలేక, సర్కార్ సపోర్ట్ దొరుకక తనువు చాలించారని సర్వేలో వెల్లడైంది.
సర్కారు సాయం కరువై..
కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతుల ఆత్మహత్యలపై రైతు స్వరాజ్య వేదిక ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. స్వరాజ్య వేదిక ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించిన కుటుంబాలను పరామర్శించి ఆత్మహత్యలకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగులోకి రావడం గమనార్హం. ముఖ్యంగా గతంతో పోల్చితే రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం సరిగ్గా అమలు కాకపోవడమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా వెల్లడైంది. సర్కార్ నుంచి సాయం అందకపోవడంతో రైతులు ఆర్థికంగా మరింత కుంగిపోయి.. ఏమీ చేయలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టుగా తేలింది. ఒకవేళ సర్కార్ నుంచి సాయం అందితే అది ఎంతోకొంత రైతులకు ఆర్థిక భరోసా కల్పించేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదని తేల్చింది. గతంలో రైతుబంధు క్రమంగా తప్పకుండా రైతుల ఖాతాల్లో జయయ్యేది. కానీ, ఇప్పుడు రైతుభరోసా పంపిణీలో సర్కార్ కోత పెడుతున్నది. ఓ సీజన్ పంపిణీ చేస్తే మరో సీజన్ కోత పెడుతున్నది. ఇలా ఈ రెండున్నరేండ్లలోనే రైతులకు రైతుభరోసా కింద ఏకంగా రూ.28,720 కోట్లు ఎగ్గొట్టింది. దీంతోపాటు సన్న వడ్లకు బోనస్ కింద ఇప్పటివరకు రెండు సీజన్లలో కలిపి సుమారు రూ.2వేల కోట్లు ఎగ్గొట్టింది. వీటితోపాటు పంటలు సకాలంలో కొనుగోలు చేసి పైసలు చెల్లించకపోవడం కూడా రైతులకు ఇబ్బందిగా మారిందనే అభిప్రాయం వెల్లడైంది. వీటితోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సర్కార్ విడుదల చేయకపోవడంతో రైతులు అప్పులు తెచ్చి బిడ్డల కాలేజీల ఫీజులు చెల్లించారు. తీరా తిరిగి వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.
అదేవిధంగా కేసీఆర్ హయాంలో బీసీబంధు, దళితబంధు, యువతకు రుణాలు.. ఇలా పలు పథకాలతో ఆయా వర్గాల్లో కొంత మందికైనా ఆర్థిక భరోసా దక్కి.. ఇబ్బందులు తొలిగాయని తేలింది. ఇక గొర్రెల పంపిణీ కారణంగా చాలామంది రైతుల చేతుల్లో నగదు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తేలింది.
భూముల ధరలు పతనమై.. విశ్వాసం సన్నగిల్లి..
బీఆర్ఎస్ సర్కార్‌లో ఎకరం భూమి ఉన్నదంటే ఆ రైతు ఎంతో గుండె నిబ్బరంతో బతికేవాడు. ఒకవేళ పరిస్థితి తలకిందులైతే అందులో అర ఎకరం అమ్ముకున్నా.. జీవితం వెళ్లదీయొచ్చన్న భరోసా ఉండేది. ఆడ పిల్లల పెండ్లిళ్లకో, పిల్లల చదువుల కోసమో అవసరమైతే ఒక ఎకరం అమ్మేసి అవసరం తీర్చుకొనేవారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదికాదు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం పాతాళానికి పడిపోయింది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూముల కొనుగోలుకు ముందుకొచ్చేవారే కరువయ్యారు. ముఖ్యంగా వ్యవసాయ భూముల ధరలు భారీగా పతనమయ్యాయి. వాటిని కొనుగోలు చేసే వారే కరువయ్యారు. పిల్లల పెండ్లిళ్లు, చదువులు, ఇతర అత్యవసరాలకు సైతం భూములను విక్రయించాలనుకున్నా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. దీంతో రైతుల్లో విశ్వాసం సన్నగిల్లింది. తప్పని పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరికి తీర్చే మార్గంలేక, వేధింపులు ఎక్కువై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
రైతుబీమా పథకమూ రద్దు
కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడొద్దనే మానవతా దృక్పథంతో నాడు కేసీఆర్ రైతుబీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా 18 ఏండ్ల నుంచి 58 ఏండ్ల వయస్సు ఉండి తమ పేరుపై గుంట భూమి ఉన్నా సరే ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఏదైనా కారణంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించేలా చర్యలు తీసుకొన్నారు. ఈ పథకం వేలాది కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచింది. రైతులు, రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచిన ఇలాంటి పథకాన్ని సైతం కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ ఆగస్టుతో రైతుబీమా పథకం రద్దు కానున్నది. ఆగస్టు తర్వాత ఈ పథకాన్ని ఇందిరమ్మ కుటుంబ బీమాలో కలుపాలని నిర్ణయించింది. అయితే, రైతుబీమాతో పోల్చితే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో రైతులకు ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుబీమా పథకంలో కుటుంబంలో ఎంతమంది ఉన్నా వారి పేరుపై ఏ కొద్దిపాటి భూమి ఉన్నా సరే వాళ్లందరికీ రైతుబీమా వర్తించేది. ఏదైనా అనుకోని ఘటనతో అందులో ఎంతమంది మరణిస్తే అంతమందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆయా కుటుంబాలకు పరిహారం అందేది. కానీ, ఇందిరమ్మ బీమా పథకంలో కేవలం కుటుంబ పెద్దకు మాత్రమే పథకం వర్తింపచేయనున్నారు. దీంతో కలిగే ప్రయోజనం అంతంతే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసాగా ఉండే ఈ పథకానికి కూడా కాంగ్రెస్ సర్కార్ చరమగీతం పాడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అన్నదాతల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం. రైతులకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నది. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమని తేలింది. భూముల ధరలు పడిపోవడంతో రైతుల ఆత్మ ైస్థెర్యం దెబ్బతిన్నది. ప్రతి పనికీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వం నుంచి సహాయం అందక అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం తక్షణమే హామీలను నెరవేర్చాలి.
-కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నేత
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబీమా లెక్కల ప్రకారం రైతుల మరణాల వివరాలు
సంవత్సరం మరణించిన రైతులు
రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతులు
సంవత్సరం ఆత్మహత్య చేసుకున్న రైతులు