హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘నాకు ప్రాణహాని ఉంది.. నన్ను చంపేలా ఉన్నారు సార్.. రక్షణ కల్పించండి’ అంటూ పోలీసులను వేడుకున్న ఓ వ్యక్తికి మెహదీపట్నం సీఐ ఇచ్చిన సమాధానం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇంకా నిన్ను చంపలేదు కదా.. నువ్వు చావలేదు కదా.. మీరూ మీరు కొట్టుకుని చచ్చిపోయాక కేసు నమోదు చేస్తానులే’ అంటూ ఆ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ నెల 4న జరిగిన ఈ ఘటనలో ఫిర్యాదుదారుడి తరపున మాట్లాడేందుకు స్టేషన్‌కు వెళ్లిన మతపెద్ద పట్ల కూడా సదరు పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ఆ పెద్దమనిషిని ఉద్దేశించి ‘ఏం.. తమాషాలు చేస్తున్నవా? నా స్టేషన్లో నాకే ఎదురుచెప్తవా? వీడిని గోడకు కూర్చోబెట్టండి’ అంటూ తీవ్రంగా దుర్భాష లాడిన ఆడియో సామాజికమాధ్యమాల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లోనే వైరల్‌గా మారింది.
అసలు కేసు ఏమిటంటే!
మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో ఈనెల 4వ తేదీన జరిగిన ఘటన ఇది. ఓ ఇంటి యజమానికి, అద్దెకున్నవారికి మధ్య వివాదం కోర్టులో నడుస్తున్నది. ఇదే సమయంలో తమపై దాడికి చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని, ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసేందుకు హుమాయున్ నగర్ రాయల్ కాలనీకి చెందిన ఫర్దీన్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఇనుపరాడ్లతో ఇంటి తలుపులను పగులగొట్టి, ఖాళీ చేయించాలని చూస్తున్నారని, తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, స్టేషన్‌కు వెళ్లాడు. ఈ వ్యవహారంపై తాను డీజీపీ, సీపీ, డీసీపీ, ఏసీపీకి కూడా ఫిర్యాదు చేశానని చెప్పాడు. అద్దెకు వచ్చే సమయంలో ఆ ఇంటియజమానితో ఒప్పందం మేరకు మరమ్మత్తులు చేయించినట్టు తెలిపాడు. యజమాని కుటుంబసభ్యులకు ఆర్థికంగా సాయం చేశానని చెప్పాడు.
ఆ ఖర్చులు తనకు తిరిగి ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో కోర్టును ఆశ్రయించానని తెలిపాడు. వివాదం కోర్టులో ఉండగానే కొందరు దాడికి యత్నించారని ఫర్దీన్ డయల్ 100కు కాల్ చేశాడు. ఆ తర్వాత మెహదీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. తన సమస్యను పోలీసులకు చెప్పే క్రమంలో మెహిదీపట్నం పోలీస్ ఇన్స్పెక్టర్ దూషించినట్టు తెలిసింది. ఫర్దీన్కు మద్దతుగా వచ్చినందుకు తనను కూడా తీవ్రపదజాలంతో సీఐ దూషించాడని మతపెద్ద ఫసియుద్దీన్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాను ప్రవచనకారుడినని, తన పట్ల ఇన్స్పెక్టర్ వ్యవహరించిన తీరు, అతను మాట్లాడిన బూతులు చాలా బాధపెడుతున్నాయంటూ తెలిపారు. ఈ విషయంలో సీపీని కలిసి బాధ చెప్పుకుంటామని వెల్లడించారు.
ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్?
ప్రభుత్వం, డీజీపీ, సీపీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తుంటే.. క్షేత్రస్థాయి అధికారులు అత్యంత హేయమైన ప్రవర్తనతో పోలీస్ డిపార్ట్మెంట్కు చెడ్డపేరు తీసుకువస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘సార్.. ఎందుకు తిడుతున్నారు? మేం గౌరవం ఇస్తున్నాం. మీరిలా మాట్లాడుతున్నారేంటి?’ అని సీఐని మతపెద్ద అడిగితే ‘నా స్టేషన్లో.. నా చాంబర్లోకి వచ్చి, నాకే ఎదురు చెప్తవా? మీ మీదనే కేసు నమోదు చేస్తాను’ అని సదరు సీఐ బెదిరించారు.
సమస్య వస్తే స్టేషన్‌కు వెళ్లాలి
‘హైదరాబాద్ ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా దగ్గరలోని పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. ఇంకా అవసరమైతే పైఅధికారులను కలవండి. మీకు సమస్య ఉంటే నేరుగా నన్ను కలవండి. ప్రజలతో సమన్వయంతో వ్యవహరిస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు పీపుల్ వెల్ఫేర్ పోలీస్ విధానం అనుసరిస్తాం’ ఇవీ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు. కానీ క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల తీరు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నది.