రంగారెడ్డి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఆస్తుల వివాదంలో సినీనటుడు మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్రేట్లో విచారణకు హాజరయ్యారు. జల్పల్లి వద్ద తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో మనోజ్ అక్రమంగా నివాసం ఉంటున్నాడని, అతన్ని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సోమవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ వాదనలు విన్నారు. ఆస్తుల విషయం పెద్దల సమక్షంలో మాట్లాడుకున్న తర్వాతే ఖాళీ చేస్తానని మనోజ్ తెలిపినట్టు సమాచారం. ఇద్దరి వాదనలు విన్న తర్వాత జాయింట్ కలెక్టర్ విచారణను 10 రోజుల పాటు వాయిదా వేశారు.
విచారణ కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోనూ మోహన్‌బాబు, మనోజ్ మధ్య అడుగడుగునా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అడిషనల్ కలెక్టర్ చాంబర్లోకి వెళ్లేటప్పుడు, రెండు గంటల పాటు జరిగిన విచారణ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని, ఓ దశలో ఘర్షణ వాతావరణం నెలకొన్నదని తెలుస్తున్నది. తండ్రీకొడుకుల మధ్య గతంలోనే ఘర్షణ తలెత్తడం, కేసులు నమోదు కావడం నేపథ్యంలో మళ్లీ గొడవలు కాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ తర్వాత ఇద్దరినీ వేర్వేరు గేట్ల నుంచి బయటకు పంపించారు. అధికారులు గేట్లు మూసివేసి, లోపలికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో వివిధ పనుల కోసం కలెక్టరేట్‌కు వచ్చిన జనాలు ఆందోళనకు దిగి, అధికారులపై మండిపడ్డారు.