హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాలు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నాయి. ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తుండగా భూముల సేకరణకు నిర్వహించిన సభలో వికారాబాద్ కలెక్టర్‌పై రైతులు తిరగబడ్డ విషయం తెలిసిందే..
తిరుగుబాటు తర్వాత ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు గిరిజన ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరును, తిరుగుబాటులో పాల్గొన్న గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దారుణాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు సోమవారం ఫిర్యాదు చేయన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు లగచర్ల గిరిజన కుటుంబాలతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఢిల్లీ వెళ్లారు. ఆమెతోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ ఎల్ రూప్ సింగ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్ర నాయక్, వాల్యా నాయక్, రాంబాల్ నాయక్ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు.
తెలంగాణలో గిరిజన బిడ్డలపై జరిగిన, జరుగుతున్న దాష్టీకంపై జాతీయ మీడియా కూడా స్పందించాలని లగచర్ల బాధితులు వేడుకుంటున్నారు. పథకం ప్రకారం కరెంటు తీసి, అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి, ఆడబిడ్డలను అసభ్యంగా తాకుతూ, పడుకున్నవారిని కూడా అట్లాగే పోలీస్ స్టేషన్లకు తరలించిన తీరుపై ప్రత్యేక కథనాలు రాయాలని కోరుతున్నారు. ‘కొండగల్‌లో జరిగిన అరాచకాలను, ఆగడాలను వెలికితీయాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులపై తిరగబడిన కాంగ్రెస్, బీజేపీ సానుభూతి పరులైన కొందరు రైతులను తప్పించి, ఆ ఘటనతో సంబంధం లేని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతాలను, తమ పోరాటాన్ని జాతీయస్థాయిలో వెలుగులోకి తేవాలని ప్రాధేయపడుతున్నారు. ‘ఏ ఇంట్ల చూసినా ఆర్తనాదాలే విపిస్తున్నయి. వాటిని ఢిల్లీ స్థాయిల చూపించండి సారూ.. మీ బాంచెన్’ అంటూ జ్యోతి అనే నిండు చూలాలు చేతులెత్తి ఢిల్లీకి వెళ్లి జాతీయ మీడియాను వేడుకుంటున్నది.
తమకు జరిగిన అన్యాయాన్ని కండ్లకుకడుతూ బాధిత కుటుంబాలు న్యాయం కోసం మద్దతు కూడగడుతున్నాయి. ఢిల్లీలో లంబాడా హక్కుల పోరాట సమితి, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక, భారత్ ముక్తి మోర్చా, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్లను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతామని పలువురు గిరిజనులు తెలిపారు. మరోవైపు లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (లాఅండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటివరకు నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. నిఘా వైఫల్యంతోపాటు స్థానికంగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.