నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితాల ప్రకటనలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తమ అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే కౌంటింగ్ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతానికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. నాలుగో రౌండ్ ఫలితం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కాగా, బీఆర్ఎస్ నేతలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.
కాగా, నల్గొండ కౌంటింగ్ కేంద్రంలో ఆర్వో తీరును నిరసిస్తూ రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన గెలుపును అడ్డుకునేందుకు ఓట్ల లెక్కింపులో అనేక అవకతవకలకు పాల్పడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి తమ ఏజెంట్స్‌ను బయటకు పంపించేస్తున్నారు. ఏకపక్షంగా ఫలితాలు ప్రకటిస్తున్నారు. రౌండ్లు పూర్తయిన తర్వాత కనీసం తమ ఏజెంట్స్ వద్ద సంతకాలు కూడా తీసుకోవడం లేదు. ఆర్వోను కలిసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. 3 గంటల పాటు ఆర్వో ఆఫీస్ వద్ద పడిగాపులు పడాల్సి వస్తుంది. 17 వేల పైచిలుకు మెజార్టీని 18 వేల పైచిలుకుగా ఏకపక్షంగా ప్రకటించారు. మూడో రౌండ్లో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజల తీర్పును శిరసావహిస్తాం. కానీ పారదర్శంగా కౌంటింగ్ జరపాలన్నది తమ డిమాండ్. ఒకే హాల్లో వెయ్యి ఓట్ల తేడా వచ్చింది. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకువాలి. కౌంటింగ్ సజావుగా నిర్వహించాలని తమ డిమాండ్ అని ఏనుగల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.