MLC Elections | హైదరాబాద్ : ఖమ్మం – వరంగల్ – నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.