హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ప్రతిపక్షం ఎకడన్నా డబ్బా కొడుతదా? ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వకపోవడం ఏంటి? సభ్యులు ముఖ్యమంత్రిని పొగడటానికి సభకొస్తరా?’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశా రు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో తెలంగాణ శాసనసభ రోజురోజుకూ విలువలు కోల్పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో స్పీకర్లు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించేవారని గుర్తుచేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి పాదయాత్రగా గన్‌పార్క్‌కు చేరుకొని అక్కడ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి తీరుకు, స్పీకర్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి జ గదీశ్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ప్రతిపక్షం గొంతునొకుతూ అధికార పార్టీ దాడి చేస్తున్నది. దేశంలో ఏ ముఖ్యమంత్రీ మాట్లాడని వి ధంగా రేవంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఒకే ప్రశ్నపై రెండు గంటలపాటు మాట్లాడటం ఏ శాసనసభ చరిత్రలో లేదు. ఆయన మూసీ కంపును తన నోటి ద్వారా అసెంబ్లీలో వదిలారు. సభలో స్పీకర్ మౌనంగా ఉండిపోతున్నారు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వనని స్పీకర్ అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వకుండా మరో పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం’ అని నిలదీశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి.. మూసీ ప్రస్తావన తేగానే వారి మైక్ కట్ చేశారని, స్పీకర్ వైఖరికి నిరసనగా తాము సభను బహిష్కరించామని తెలిపారు.
అసెంబ్లీలాగా నడిపితేనే వస్తాం: తలసాని
అసెంబ్లీని గాంధీభవన్‌లా కాకుండా అసెంబ్లీలాగా నడిపిస్తేనే తాము సభలోకి వస్తామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. చరిత్రలో అనేక ప్రభుత్వాలను చూశాంకానీ, ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న సర్కారును ఇప్పుడే చూస్తున్నామని విమర్శించారు. నాడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నా వారికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము సభకు వచ్చేది సీఎంకు డబ్బా కొట్టడానికా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య విలువలు ఖూనీ: వేముల
రాష్ట్ర అసెంబ్లీలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా ఖూనీ అవుతున్నాయని మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాల పట్ల స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వబోమని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ధోరణి అని ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక కేసీఆర్ చావు కోరుతూ, హరీశ్‌రావును బాడీ షేమింగ్ చేస్తూ రేవంత్‌రెడ్డి రొడ్డ వాగుడు వాగారని విమర్శించారు.