హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఎమ్మెల్యే గాదరి కిశోర్ బంగారం కానుకగా సమర్పించారు. తుంగతుర్తి నియోజకవర్గం తరఫున, కుటుంబం తరఫున కలిసి 158 తులాల బంగారాన్ని దేవస్థానం ఈవో గీతకు అందజేశారు. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పoతో యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించారన్నారు.
గత ప్రభుత్వాలు ఆలయాలను ఆదాయ వనరులుగా మాత్రమే చూశాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున ఆలయాలను అన్నింటిని అభివృద్ధి చేస్తున్నారన్నారు. దూపదీప నైవేద్యం పథకం ద్వారా అర్చకుల సంక్షేమానికి పాటు పడుతున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు సీఎం కేసీఆర్, యావత్ ప్రజానీకంపై ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.
కుటుంబ సమేతంగా యాదాద్రి చేరుకున్న ఎమ్మెల్యే కిశోర్ మొదట బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంగారాన్ని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు గజ్జ దీపికా దంపతులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి, ధర్మేందర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.