నమస్తే తెలంగాణ, నెట్వర్క్, సెప్టెంబర్ 24: కేసీఆర్ పుట్టింటి కానుకగా ఆడబిడ్డలకు ఇస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక పజాప్రతినిధులు ఓ ఉద్యమంలా చీరలను పంచిపెడుతున్నారు. చీరలు అందుకున్న ఆడబిడ్డలు వాటిని చూసుకుని సంతోషంతో మురిసిపోతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నదని చెప్పారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రూ.42 లక్షలతో నిర్మించిన సహకార సంఘ భవనం, గోదాములను, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అభివృద్ధి పనులు ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర, వరంగల్ జిల్లా రాయపర్తిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలో మహిళలకు ఏనాడూ గుర్తింపు లేదని, సీఎం కేసీఆర్‌తోనే గుర్తింపు వచ్చిందని చెప్పారు.
సంతోషంగా జరుపుకోవాలి
శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం, శ్రీనివాసపూర్, ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్‌లో, పెద్దమందడి మండలం వీరాయపల్లి, దొడగుంటపల్లి, చిన్నమందడి, అల్వాలలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బతుకమ్మ చీరలు పంచిపెట్టారు. ఆడబిడ్డలు సంస్కృతి, సంప్రదాయాలతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసరా పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలను అందజేస్తున్నట్లు చెప్పారు. గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్ బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. బతుకమ్మ చీరలతో పేద కుటుంబాల్లో సంతోషాన్ని నింపడంతో పాటు ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నట్లు చెప్పారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో, సారంగాపూర్ మండలంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో, పటాన్చెరు డివిజన్ 113లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం ఫరీద్‌పూర్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి బతుకమ్మ చీరలు పంచిపెట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఫైజాబాద్‌లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఆడబిడ్డలకు పెద్దన్నలా కేసీఆర్
రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళలతో కలిసి ఆమె కొద్దిసేపు బతుకమ్మ ఆడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే బతుకమ్మను గొప్పగా జరుపుకొంటున్నట్లు తెలిపారు. బతుకమ్మ చీరను కానుకగా కాకుండా సీఎం కేసీఆర్ అభిమానాన్ని, సిరిసిల్ల నేతన్న కష్టాన్ని చూడాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక డిజైన్లలో చీరలు
బతుకమ్మ కానుకగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరెలు మగువలను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వెండి, బంగారు రంగు జరీ అంచులు కలిగిన చీరెలు షోరూముల్లో లభించే వాటిని తలదన్నేలా ఉండటం విశేషం. ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నిఫ్ట్ సహకారంతో బతుకమ్మ చీరెలను తీరొక్క రంగుల్లో తయారుచేశారు. 240కి పైగా వెరైటీల చీరెలను సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లి, గద్వాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాలలో తయారు చేయించినట్టు తెలంగాణ చేనేత సహకార సంస్థ(టెస్కో) అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 2లోపు పంపిణీ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
గునుగు పువ్వుల్లో గౌరమ్మవై
పల్లెల్లో బతుకమ్మ సందడి మొదలైంది. విశ్వసాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలపెట్టిన బతుకమ్మ వీడియో సాంగ్ పోటీలకు యాదాద్రి భువనగిరి జిల్లా తొలి వేదికైంది. విశ్వ సాహితీ ట్రస్ట్, నమస్తే తెలంగాణ సంయుక్త భాగస్వామ్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మోత్కూరుకు చెందిన డైరెక్టర్ నల్లగిరి దర్శకత్వంలో శనివారం మోత్కూరు, గుండాల మండలాల పరిధిలోని రామారం, మోత్కూరు బుజిలాపురం, పొడిచేడు-అమ్మనబోల్ గ్రామాల్లో మూసీ నది పరీవాహక ప్రాంతంలో బతుకమ్మ పాట చిత్రీకరణ ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు కూడా అందజేయనున్నారు.
బహుమతుల వివరాలు..