Kaleshwaram | నిజామాబాద్ : వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని, కరువులో కూడా నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు సాగు నీళ్లు అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలను నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు చేర్చిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది ఒక మహా అద్భుత కార్యక్రమం.. కాళేశ్వరం నీళ్లు రూరల్ నియోజక వర్గం వరకు చేరుకోవటం నా భూతో నా భవిష్యత్ అన్నారు. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నుండి పైపు లైన్లు, పంపు హౌజ్‌ల ద్వారా 20వ ప్యాకేజీతో నీళ్ళు తీసుకొచ్చామన్నారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేసే ప్రతి పక్షాలకు ఇక్కడికి వచ్చిన నీళ్ళే సరైన సమాధానం చెప్తాయన్నారు. వట్టిపోయిన వాగులకు జలకళ సంతరించుకుంది. వాగులోకి వస్తున్న నీటిని చూసి సీఎం కేసీఆర్‌ను మనసారా ఆశీర్వదించండి. 20, 21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము ఇచ్చిన మాట మేరకు 20, 21 ప్యాకేజీ ల ద్వారా నీటిని తీసుకు వచ్చాము. మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి తాగు నీరు ఇచ్చినట్లు ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్ లేట్ వాల్వ్‌ను ఏర్పాటు చేస్తాం. ఇదుకు అవసరమయ్యే పైపు లైను వేసేందుకు రైతులు అవకాశం ఇవ్వాలి. కరెంట్, బోరు, వర్షాలతో సంబంధం లేకుండా వాల్వూ తిప్పగానే సాగు నీరు మీ పంట పొలాల్లో చేరిపోతుంది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులకు సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. జిల్లా రైతాంగం తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 26 వందల కోట్ల వ్యయంతో ప్యాకేజీ పనులు చేపట్టి రైతులకు ఇచ్చిన మాట నేరవేర్చాము. ఇజ్రాయిల్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ డిజైన్ చేసి పూర్తి చేశాము. కాళేశ్వరం జలాలు రూరల్ నియోజక వర్గం వరకు చేరుకోవటం ఒక చరిత్ర. కరువు వచ్చినా సాగునీటికి అంతరాయం ఉండదు. ఇప్పటికే 25 చెక్ డ్యాంలు పూర్తి చేసుకున్నాం. భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయి. రైతులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వ దించాలని గోవర్ధన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.