హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 8 నెలలుగా అభయహస్తం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి నేటి ఫొటోగ్రఫీ ప్రదర్శన నిదర్శనమని చెప్పారు.
అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర సమాచార- పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన వేర్వేరు వేడుకల్లో ఆయన పాల్గొని, ఫొటోగ్రఫీ ప్రదర్శనను ప్రారంభించారు. అభయహస్తం హామీలపై నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీలను ప్రదర్శించారు. 5 క్యాటగిరీలలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన ఫొటోగ్రాఫర్లుకు మెమెంటో, నగదు పురసారాలు అందజేసి, అభినందించారు. ఫొటోతో కూడిన వార్తకు పరిపూర్ణత చేకూరుతుందని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చెప్పారు.
నమస్తే తెలంగాణ ఫొటోజర్నలిస్టులు పలు అవార్డులు దక్కించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విభాగంలో గృహజ్యోతి పథకం చిత్రానికి పీ సైదిరెడ్డి (సూర్యాపేట) ప్రథమ బహుమతి, రూ.20వేల నగదు, ఉత్తమ వార్త చిత్రానికి బందిగే గోపి(మహబూబ్నగర్) కన్సోలేషన్ బహుమతి, గృహాజ్యోతి పథకానికి మెరుగు ప్రతాప్(వరంగల్) కన్సోలేషన్ బహుమతి, రూ.5వేల నగదు దక్కించుకున్నారు. మంత్రి పొంగులేటి వారిని సత్కరించారు. అదనపు పీఆర్వో చింతల శ్రీనివాస్, ఏవీఎస్ అధికారులు నాగరాజశర్మ, ప్రసాద్, లక్ష్మీనారాయణకు అవార్డులు దక్కాయి.