మేడ్చల్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకొయలో బుధవారం బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్( Chief Minister KCR ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో పుట్టి ఉంటే బాగుండు అని ఇతర రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారని ఆయన వెల్లడించారు.
అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు, తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ(Bjp) పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పెద్దబలగమని, పెద్దబలగమైన బీఆర్ఎస్ను ఢీ కొట్టె సత్తా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దేశమంతటా సత్తా చాటుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు రావడాన్ని చూస్తుంటే దేశమంతటా బీఆర్ఎస్ పార్టీ సత్తా ఎమిటో అర్థమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని కావడం ఖాయమని అన్నారు.
కేంద్రంలో బీజేపీ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సెక్టార్లను అమ్మి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 10వ తరగతి ప్రశ్న పత్రాలను లీక్ చేయిస్తూ విద్యార్థుల జీవితాలతో బండి సంజయ్(Bandi Sanjay) చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశ్వీరదించాలని ఎమ్మెల్సీ(Mlc) పల్లారాజేశ్వర్‌రెడ్డి కోరారు. ప్రతి ఇంటికి సంక్షే పథకాన్ని అందించిన కేసీఆర్‌ను మూడవసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు(Medical colleages) మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ సురభివాణిదేవి, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గాదయాకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ విజయనందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.