హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ హబ్‌లోనూ కొత్తగా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పా రు. మహిళా వ్యాపారవేత్తలకే కాకుండా స్వ యం సహాయక సంఘాలకు మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఈ విధానం అందుబాటులో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో బుధవారం నిర్వహించిన ‘వీ హబ్’ ఐదో వార్షికోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజయాలు సాధించిన పలువురు మహిళా పారిశ్రామికవేత్తలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వీ హబ్ ఐదేండ్ల కాలంలో 5 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి 3,194 స్టార్టప్‌లను నెలకొల్పే దిశగా తోడ్పాటు అందించిందని చెప్పారు. తెలంగాణ నుంచి భారతదేశం గర్వించే ఉత్పత్తులను సృష్టించాలని, ప్రపంచమే గర్వపడేలా ఇక్కడి మహిళలు రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆడపిల్ల అంటే తొందరగా పెండ్లి చేసి పంపించి వేద్దామన్న రోజులు పోయాయని చెప్పారు. మగవాళ్లతో పోటీపడి మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిల ఇష్టానుసారాన్ని బట్టి చదివించాలని సూచించారు.
ఎవరైనా ఇంట్లో బాస్‌కి భయపడాల్సిందే
మహిళలు అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘మేం బయటికి ఎంత నటించినా ఇంట్లో మీరే బాస్‌లు. ఎంత పెద్ద నేతైనా ఇంటికి వెళ్లాక బాస్‌కు భయపడాల్సిందే. ప్రతి రోజూ వారిని గౌరవించాలి’ అని అన్నారు.
పారిశ్రామికవేత్తలకు సత్కారం
వీ హబ్ వార్షికోత్సవం సందర్భంగా పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్న మాయా వివేక్ (ఊర్వి సొసైటీ), రుబీనా మజ్హర్ (సఫా సొ సైటీ), సాహిత్య రాజ్ (స్వీటూత్ ఫౌండర్), సురభి గుహ (సోర్టిజీ ఫౌండర్), మల్లికా వ ల్లూరు (రేడియస్ ఎడుటెక్ ఫౌండర్), పసుల మంగ (కొయ్య బొమ్మలు)లను మంత్రి కేటీఆర్ సత్కరించారు. సాయి మానస, అంజుమ్ అనే విద్యార్థినులతో మాట్లాడిన కేటీఆర్.. వీ హబ్‌ను సంప్రదిస్తే ప్రోత్సాహం అందిస్తామని హామీఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన లత గార్మెంట్స్‌ను స్థాపించి రెండు వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్టు తెలుసుకున్న మంత్రి ఆమెను అభినందించారు. వేడుకల్లో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వీ హబ్ సీఈవో దీప్తి రావుల, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
నాకంటే ముందే నా చెల్లి యూఎస్ వెళ్లింది..
‘మా తల్లిదండ్రులు మా పట్ల వివక్ష ఎప్పుడూ చూపించలేదు. నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. నా కంటే ముందు నా చెల్లిని యూఎస్‌కు పంపారు. నా కూతురు 9వ తరగతి చదువుతున్నది. ఆమె ఇప్పటికే పుస్తకాలు రాసింది. మ్యూజిక్‌ని ఇష్టపడుతుంది. తను మంచి ఆర్టిస్ట్ అవుతుందని అనుకుంటున్నా.. నా కూతురు ఏం అయినా సరే! మంచి వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటున్నా. కిందపడితే మేం ఉంటామనే ధైర్యాన్ని పిల్లలకు కల్పిస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.