Konda Surekha | ‘కొండా’ సీటుకు ఎసరు.. మంత్రి పదవి కోసం సురేఖ వెనుక ‘కులబాంధవుల’ గోతులు!
Konda Surekha | కాంగ్రెస్‌లో రేగిన చిచ్చులో మంత్రి కొండా సురేఖపై ఇంకా వేటు పడకముందే, క్యాబినెట్లో ఆమె బెర్తును దక్కించుకునేందుకు కొందరు నేతల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
Konda Surekha |హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో రేగిన చిచ్చులో మంత్రి కొండా సురేఖపై ఇంకా వేటు పడకముందే, క్యాబినెట్లో ఆమె బెర్తును దక్కించుకునేందుకు కొందరు నేతల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వాస్తవానికి కొండాపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ గానీ, అధిష్ఠా నం పెద్దలు గానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చర్యలు తీసుకొనే ఆలోచనతో ఉన్నట్టు ఢిల్లీ నుంచి ఎలాంటి సంకేతాలూ లేవు.
అయినా ఆమె స్థానంలో మంత్రి పదవి కోసం పైరవీలు మొదలైనట్టు అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. ఒకవేళ సురేఖను తొలగిస్తే ఆమె స్థానంలో మున్నూరుకాపు సామాజిక వర్గానికే పదవి దక్కాలనే వాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తెచ్చి, ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆశావహ నేతలు ఎవరికి వారుగా ఢిల్లీ బాట పడుతున్నారట. పదవి ఖాళీ కాకముందే హస్తినకు ప్రదక్షిణలు చేయడం, ఎవరి స్థాయిలో వారు మంతనాలు చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలోని పదవీ వ్యామోహాన్ని మరోసారి బహిర్గతం చేసిందని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోనియా కేంద్రంగా రాములమ్మ
సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా ఢిల్లీ కేంద్రంగా ముమ్మరంగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. సురేఖ స్థానంలో అంతే దీటైన మహిళా నేత కాంగ్రెస్‌కు అవసరమని, ఆ స్థానాన్ని తాను సమర్థంగా భర్తీ చేయగలనని ఏఐసీసీ నాయకత్వానికి చేరవేస్తున్నట్టు సమాచారం. సోనియాగాంధీ తనకు హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చడంలో ఇప్పటికే ఆలస్యం అయిందని ఆమె సెంటిమెంట్ కార్డు వాడుతున్నారట. బీజేపీ ఆహ్వానాన్ని పకనబెట్టి కాంగ్రెస్‌లోనే కొనసాగడం, తనది ఉమ్మడి వరంగల్ జిల్లా కావడం, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర వంటి అంశాలను విజయశాంతి అధిష్ఠానం ముందుంచినట్టు తెలిసింది.
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన సీనియర్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సైతం క్యాబినెట్ రేసులోకి వచ్చారు. సురేఖను తొలగిస్తే వరంగల్ జిల్లాకు చెందిన బీసీ నాయకుడికే ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ అర్హతలు పూర్తిగా తనకు ఉన్నాయని అధిష్ఠానం పెద్దలకు వివరిస్తున్నట్టు తెలిసింది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం తనకు ఉన్నదని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఎన్నికలు అవసరం లేకుండా నేరుగా బాధ్యతలు చేపట్టవచ్చని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నారట. మొత్తంగా ఈ కష్టకాలంలో కొండా కుటుంబానికి అండగా నిలబడాల్సిన ‘కుల బాంధవులు’.. గోతికాడి నక్కల్లా పదవి కోసం ఎదురు చూస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
‘ఆది’లోనే ఆశలపై నీళ్లు?
మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలతో ఇప్పటికే మంత్రివర్గం నిండిపోవడం ఆయనకు ప్రధాన ప్రతిబంధకంగా మారినట్టు చెప్తున్నారు. ఇప్పటికే దుదిళ్ల శ్రీధర్‌బాబు(ఓసీ), పొన్నం ప్రభాకర్ (బీసీ), అడ్లూరి లక్ష్మణ్ (ఎస్సీ) మంత్రివర్గంలో ఉన్నారు. అదే జిల్లాకు మరో పదవి కట్టబెడితే ఇతర ప్రాంతాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తారనే చర్చ జరుగుతున్నది. దీంతో ఆది శ్రీనివాస్ ఆశలపై ఆదిలోనే నీళ్లు చల్లినట్టయిందని చెప్పుకుంటున్నారు.
ఢిల్లీలో కేకే ప్రయత్నాలు
ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు తన కుమార్తె, మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మికి మంత్రి పదవి ఇప్పించేందుకు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారని చెప్తున్నారు. జాతీయ స్థాయిలో దశాబ్దాలుగా తనకున్న పాత పరిచయాలను, ఏఐసీసీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుంటూ, బలమైన లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మహిళను తొలగిస్తే ప్రజలు, విపక్షాల నుంచి వచ్చే వ్యతిరేకతను, విమర్శలను తిప్పికొట్టేందుకు మరో మహిళకే అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను అధిష్ఠానం ముందు పెడుతున్నట్టు తెలిసింది.
మున్నూరుకాపు సామాజికవర్గాన్ని గుర్తుచేస్తూ విజయలక్ష్మిని క్యాబినెట్లోకి తీసుకొంటే బీసీ కోటా, మహిళా కోటా ఒకేసారి భర్తీ అవుతాయని చెప్తున్నారట. ప్రస్తుతం ఆమె చట్టసభల్లో సభ్యురాలు కాదని, మొదట మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి, ఆరు నెలల వ్యవధిలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం లేదా గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపవచ్చని ప్రతిపాదిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. తద్వారా రాబోయే రోజుల్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆశ పెడుతున్నట్టు సమాచారం. విజయలక్ష్మి బీఆర్ఎస్లో ఉండగా హైదరాబాద్ మేయర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. తండ్రి కేశవరావుతోపాటు ఆమె కూడా అప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. అందుకు ప్రతిఫలంగానే మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

