Review Meeting | బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి, ఎక్సైజ్‌శాఖకు చెడ్డ పేరు వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కీలకమైన స్థానాల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో అబ్కారీ శాఖపై సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల నిర్ణయాలతో ఎక్సైజ్‌శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని.. దాంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. మద్యం కంపనీల అనుమతుల వ్యవహరంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధివిధానాలు ఖరారు చేస్తారని మండిపడ్డారు. ఈ విషయంపై సంజాయిషీ ఇవ్వాలని.. విచారణ జరిపి సమగ్ర నివేదిక జరిపి నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ కమిషనర్ అబ్రహంను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.