Harish Rao | ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తూప్రాన్ మండల్ వెంకటాయపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. శివాజీ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా జీవించేవని.. మత సామరస్యానికి ప్రతీక శివాజీ అన్నారు. ఆయన ఏ ఒక్క వర్గానికో పరిమితమైన వ్యక్తి కాడని.. ఆయన సైన్యంలో కీలక స్థానాల్లో ముస్లింలు పని చేశారన్నారు. కొందరు శివాజీని ఓట్ల కోసం వాడుకుంటూ ఉంటున్నారన్నారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని.. కేసీఆర్ శివాజీ బాటలో పది సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారన్నారు. మూడు నెలల కాంగ్రెస్ పాలన చూస్తున్నామని.. ఎన్నెన్నో హామీలుయిచ్చారని.. వాటి అమలుపై శ్రద్ధ చూడం లేదన్నారు. రైతులు సమస్యలతో అల్లాడుతున్నారని.. పొలాలకు నీరందక రైతాంగం రోజంతా పరేషాన్లో ఉన్నారన్నారు.
సామాజిక న్యాయం సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రికే దొరకడం లేదని.. సామాన్యుడికి ఏం దొరుకుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ చెప్పిందేమో కొండంత.. చేస్తుందేమో గోరంత.. మాటలు ఎక్కువ చేతలు తక్కువ అంటూ విమర్శించారు. రేవంత్ మాట్లాడే భాష.. బజారు భాష కంటే హీనంగా ఉందన్నారు. ఓ ముఖ్యమంత్రిలా మాట్లాడడం లేదని.. బజారు మనుషులు కూడా ఆ రకంగా మాట్లాడుకోరన్నారు. సీఎం పదవి ప్రతిష్ట దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. చీమునెత్తురుంటే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది ? ఎందుకు చేయలేదంటూ నిలదీశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు 13 హామీలు ఎక్కడ పోయాయి హామీలు ? అంటూ మండిపడ్డారు. అక్కచెల్లెళ్లకు ఇస్తానన్న రూ.2500 ఎక్కడపోయాయి.. రేవంత్ అని అడుగుతున్న.. మా అవ్వాతాతలకు ఇచ్చే రూ.4వేల పెన్షన్ ఎక్కడ అని ప్రశ్నించారు. బోనస్, రుణమాఫీ, రూ.15వేల రైతుబంధు, తులం బంగారం ఎగ పెట్టారని ఆరోపించారు. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని.. నోరు పెంచుకోవడం కాదు.. విజ్ఞతతో పాలన చేయాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.
రేవంత్‌ను ఎవరు దించరని.. హామీలు నెరవేర్చపోతే ఐదేళ్ల తర్వాత జనమే తిరగబడుతారన్నారు. తెలంగాణ ప్రజలే అధికారం నుంచి దించుతారన్నారు. దించుడు నీకు.. నీ గురువు చంద్రబాబుకు అలవాటని.. ఓటుకి నోటు కేసులు పట్టపగలు దొరికింది రేవంత్రెడ్డేనన్నారు. ఆయనను ప్రజలే దించుతరని..
అడ్డ దారిలో నడవడం నీకు.. నీ గురువుకి అలవాలటని.. తమకు ఆలోచన లేదన్నారు. తాము ప్రజలను నమ్ముకుంటామని.. చిల్లర చేష్టలు అవసరం లేదన్నారు. కాళేశ్వరంతో ఎండా కాలంలో కూడా నీళ్లు పారినయని.. ఏదో రెండు పిల్లర్లు దెబ్బ తింటే బాగు చేయటం చేతకాక కేసీఆర్‌ను తిడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో కడెం వాగు, పాలెం వాగు కొట్టుకుపోలేదా? దేవాదుల పైపులు పగల్లేదా? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం కరెంటు లేదని.. మోటార్లు కాలిపోతున్నాయన్నారు. బోనస్‌కి దిక్కులేదని.. మాయ మాటలు చెప్పి సిగ్గు లేకుండా ఎన్నాళ్లు బతుకుతవు? అంటూ ధ్వజమెత్తారు.
యాసంగి వడ్లకు 500 బోనస్ ఇచ్చి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని.. మొన్న మోదీ వేస్తే సాష్టాంగ నమస్కారం పెట్టిండని.. బడే భాయి అంటున్నడన్నారు. బడే భాయ్.. చోట భాయి ఒక్కటైండు.. బీజేపీతో కుమ్మక్కై బిఆర్ఎస్ లేకుండా చేద్దామనుకుంటున్నారని.. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డిది ఎన్నడైనా జై తెలంగాణ అన్న మొఖమా ? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని.. తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడబడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా ఉండాలన్నారు.