సిద్దిపేట : నిరంతరం అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైద్య అధికార సిబ్బందిని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జిల్లాలోని మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో వైద్యం అందుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
దవాఖానలో మందులు లేవనే మాట రావొద్దని ఫార్మసిస్టుకు సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఫార్మాసిస్టు ఖచ్చితంగా దవాఖానలో ఉండాలని ఆదేశించారు. పీహెచ్సీ పరిధిలోని నిధుల నిల్వ అంశంపై ఆరా తీశారు. తిమ్మాపూర్ పీహెచ్సీ సరిగా లేదని వెంటనే డీఏంహెచ్ఓతో మాట్లాడి హెచ్‌డీఎస్ నిధులు తెప్పించుకోవాలని పీహెచ్సీ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

ఏఎన్సీ పర్సంటేజీ ఎంత ఉంది? టీబీ శాంపిల్స్ తీసుకుంటున్నారా? టీబీ రోగులకు డబ్బులు పడుతున్నాయా..లేదో వివరాలు అడిగి తెలుసుకుంటూనే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హెచ్‌డీఎస్ డబ్బులు వాడుకునేలా ఆమోదం ఇవ్వాలని డీఏంహెచ్ఓ కాశీనాథ్‌ను ఆదేశించారు.
నార్మల్ డెలివరీలపై దృష్టి సారించాలి..
సహజ ప్రసవాలు జరిగేలా చొరవ చూపాలని వైద్య సిబ్బందిని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. లేబర్ రూమ్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని అడిగి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. వైద్యులు, స్టాఫ్ నర్సు నార్మల్ డెలివరీలు చేయాలని, వాటి ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. మంత్రి వెంట ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.